TDP Leaders on CM YS Jagan: వైకాపా అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా.. ఇంకా తెదేపా ప్రభుత్వంపైనే బురదజల్లితే ఎలా అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డిని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నిలదీశారు. నిజంగా తెదేపా హయాంలో ఉపాధిహామీ పనుల్లో అవినీతి జరిగితే.. అధికారంలో ఉన్న మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. తన అసమర్థత, వైకాపా ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చడానికే పంచాయతీ రాజ్ మంత్రి.. తెదేపాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మూడేళ్లనుంచి.. గతప్రభుత్వంలో పనులుచేసిన వారికి బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారని దుయ్యబట్టారు. తెదేపా పాలనలో నిర్మించిన పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, శ్మశానవాటికలకు రంగులేసుకోవడం తప్ప.. ఎక్కడా ఒక్క పని కూడా చేయలేదని అమర్నాథ్‌రెడ్డి విమర్శించారు.
తక్షణమే ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయాలి..
వైఎస్ వివేకా హత్యకేసులో ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడం లేదని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్కు రాజకోట రహస్యమంతా తెలుసని అన్నారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిపాత్రపై సాక్షాలు బయటపడ్డాక కూడా ముఖ్యమంత్రి ఎందుకు నోరు విప్పడని మండిపడ్డారు. అసలుదోషులను అరెస్ట్ చేయడానికి సీబీఐ ఎందుకు తటపటాయిస్తోందన్నారు. లోక్ సభ స్పీకర్ అనుమతి తీసుకొని తక్షణమే ఎంపీ అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.