నేరస్తులు ప్రజా ప్రతినిధులుగా మారడంపై ఏడీఆర్ సంస్థ ఇచ్చిన నివేదికలో వైకాపా నేతలు ముందున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు చినరాజప్ప ఎద్దేవా చేశారు. దొంగచేతికి తాళాలిచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి అనే నేరస్తుడిని ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని.. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని వైకాపా నేతలు కబ్జాలు, దోపిడీలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం అవినీతిలో తొలిస్థానంలో, అభివృద్ధిలో ఆఖరి స్థానంలో ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి చేస్తున్న నిర్వాకాలతో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కోర్టు బోనుల్లో నిలబడుతున్నారని అన్నారు. దొంగలు, అత్యాచారాలకు పాల్పడేవారు, కబ్జారాయుళ్లు, అవినీతిపరులకు వైకాపా కేంద్రంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని నలుగురు మంత్రులు, నలుగురు ఎంపీలు, 18 మంది ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వంలో నేరస్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని ప్రజలు గమనించాలని నిమ్మకాయల చినరాజప్ప కోరారు.
ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రవీణ్.. చర్చల పేరుతో మాజీ ఎమ్మెల్యేను, ఆదివాసీలను నేలపై కూర్చోబెట్టడాన్ని చినరాజప్ప ఖండించారు. ఐటీడీఏ.. ఆదివాసీలకు తల్లి లాంటిదని, కానీ ఈ మధ్యకాలంలో ఐటీడీఏ పట్ల ఆదివాసీలకు ఉండే విశ్వసనీయత సన్నగిల్లుతోందన్నారు. గిరిపుత్రుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఐటీడీఏలో జరుగుతున్న పరిణామాలకు వ్యతిరేకంగా ఆదివాసీలు ఉద్యమించే పరిణామాలు చోటు చేసుకోవడంపై మండిపడ్డారు. 45 ఏళ్ల ఐటీడీఏ చరిత్రలో మునపెన్నడూ ఇటువంటి పరిస్థితులు రాలేదన్నారు.