అమరావతి రాజధానిలో విశాలమైన రహదారులు, అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నా... మంత్రులు ఇవేమీ చూడకుండా అపోహాలు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఒక కులానికి రాజధానిని ఆపాదిస్తూ... వైకాపా నేతలు నీచమైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేసే ఆరోపణలపై విచారణ చేసి నిజనిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు. 100 రోజుల పాలన రివర్స్ టెండరింగ్ లాగానే రివర్స్‌గా పోతుందని ఎద్దేవా చేశారు.
వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది: తెదేపా - YCP
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లనే పూర్తిగా విఫలమైందని... తెలుగుదేశం పార్టీ విమర్శించింది. విజయవాడలోని తెదేపా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్, కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు వైకాపా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని... రాజధానిపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని రవీంద్ర డిమాండ్ చేశారు. గతంలో జగన్ చిత్రపటానికి ఆశా వర్కర్లు పాలాభిషేకం చేశారని... జూన్ 30న పాడి కట్టిన విషయం గమనించాలన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంపై మంత్రి బొత్స అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి అయ్యాక ఒక్కసారైనా రాజధానిలో పర్యటించారా అని ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయం మేరకే గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఇదీ చదవండీ...రాజధాని భూముల్లో అనేక అక్రమాలున్నాయి: బొత్స