ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Swachha sarvekshan2021:స్వచ్ఛసర్వేక్షణ్‌ 2021లో విజయవాడకు 3, విశాఖపట్నానికి 9 ర్యాంకులు

స్వచ్ఛసర్వేక్షణ్‌-2021 ర్యాంకుల్లో విజయవాడ 3, విశాఖపట్నం 9వ ర్యాంకు సాధించాయి. గతేడాదితో పోలిస్తే విజయవాడ ఒక ర్యాంకు మెరుగుపరుచుకోగా, విశాఖపట్నం అదే స్థానానికి పరిమితమైంది. 10లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల జాబితాలో మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ నగరం వరుసగా 5వసారి తొలి ర్యాంకు దక్కించుకుంది. గుజరాత్‌లోని వ్యాపార కేంద్రం సూరత్‌ రెండో స్థానం చేజిక్కించుకుంది.

Swachhasarvekshan2021
Swachhasarvekshan2021

By

Published : Nov 21, 2021, 7:46 AM IST

కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ శనివారం విడుదల చేసిన స్వచ్ఛసర్వేక్షణ్‌-2021 ర్యాంకుల్లో విజయవాడ 3, విశాఖపట్నం 9వ ర్యాంకు సాధించాయి. గతేడాదితో పోలిస్తే విజయవాడ ఒక ర్యాంకు మెరుగుపరుచుకోగా, విశాఖపట్నం అదే స్థానానికి పరిమితమైంది. 10లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల జాబితాలో మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ నగరం వరుసగా 5వసారి తొలి ర్యాంకు దక్కించుకుంది. గుజరాత్‌లోని వ్యాపార కేంద్రం సూరత్‌ రెండో స్థానం చేజిక్కించుకుంది. 1-10 లక్షల జనాభా కేటగిరీలో తిరుపతి మూడో ర్యాంకులో నిలిచింది. క్రితంసారికంటే మూడు ర్యాంకులు మెరుగుపరుచుకుంది. శనివారం ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయస్థాయిలో తొలి 3 ర్యాంకుల్లో నిలిచిన నగరాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అవార్డులు అందజేశారు. పది లక్షలకుపైగా జనాభాగల నగరాల జాబితాలో ఏపీ రెండు, 1-10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో వందలోపు ర్యాంకులను మూడు పట్టణాలు చేజిక్కించుకున్నాయి. ఈ ఏడాది నిర్వహించిన సర్వేక్షణ్‌లో దేశవ్యాప్తంగా 4,320 నగరాలు పాలుపంచుకున్నాయి. క్రితంసారికంటే ఈ సంఖ్య 78 ఎక్కువ. మొత్తం ఆరువేల మార్కులకు సర్వే నిర్వహించారు. సర్వీసు లెవెల్‌ ప్రోగ్రెస్‌కు 40%, సర్టిఫికేషన్‌కు 30%, సిటిజన్‌ వాయిస్‌కు 30% మార్కులు కేటాయించారు. మొత్తం 4,04,53,231 మంది అభిప్రాయాలను దశలవారీగా సేకరించారు. పౌరసేవల పురోగతిలో ఛత్తీస్‌గఢ్‌ దేశంలో ప్రథమంగా నిలవగా.. ఆంధ్రప్రదేశ్‌ 7, తెలంగాణ 8వ స్థానాలకు పరిమితమయ్యాయి.

* సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌లో 10-40 లక్షల జనాభా కేటగిరీలో గ్రేటర్‌ విశాఖపట్నం బెస్ట్‌ బిగ్‌ సిటీగా నిలిచింది.

* ఇదే కేటగిరీలో 1-3 లక్షల జనాభా కేటగిరీలో తిరుపతి బెస్ట్‌ స్మాల్‌సిటీ స్థానాన్ని దక్కించుకుంది.

* దక్షిణజోన్‌లో లక్షలోపు జనాభా ఉన్న నగరాల్లో ఇన్నోవేషన్‌ అండ్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌లో బెస్ట్‌ సిటీగా పిఠాపురం నిలిచింది.

* చెత్తరహిత నగరాల్లో 5స్టార్‌రేటెడ్‌ దక్కించుకున్న నగరాల్లో విజయవాడ ఒకటిగా నిలిచింది.

* ఆంధ్రప్రదేశ్‌నుంచి 30,44,594 (7.52%)మంది నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు.

* 10-40 లక్షల కేటగిరీలో నిర్వహించిన సర్వేలో 6వేలమార్కులకుగాను విజయవాడకు 5,368.37, విశాఖకు 4,717.92 మార్కులొచ్చాయి. ఈ కేటగిరీలో మొత్తం 48 ర్యాంకులు ప్రకటించగా.. అందులో ఏపీకి 3, 9 దక్కాయి.

* 1-10 లక్షల కేటగిరీలో తిరుపతికి 4,945.33 మార్కులొచ్చాయి. ఈ కేటగిరీలో మొత్తం 100 ర్యాంకులు ప్రకటించగా అందులో రాజమహేంద్రవరానికి 41, కడపకు 51, కర్నూలుకు 70వ ర్యాంకులు దక్కాయి.

* దక్షిణాది జోన్‌లో పుంగనూరు ఓవరాల్‌ కేటగిరీలో మూడో ర్యాంకు సాధించింది.

జాతీయ స్థాయిలో టాప్‌-5 పెద్ద నగరాలు

1. ఇండోర్‌
2. సూరత్‌
3. విజయవాడ
4. నవీముంబయి
5 పుణే

టాప్‌-5 చిన్న నగరాలు

1. న్యూదిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌
2. అంబికాపుర్‌
3. తిరుపతి
4. నోయిడా
5. ఉజ్జయిన్‌

* రాష్ట్రాల పనితీరుకు ఇచ్చిన ర్యాంకుల్లో ఏపీ 5వ స్థానంలో నిలిచింది. గతేడాదికంటే ఒక ర్యాంకు మెరుగుపరుచుకుంది.

* ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన ప్రేరక్‌దౌర్‌ సమ్మాన్‌ విభాగంలో తిరుపతి తొలి ర్యాంకు దక్కించుకొని ప్లాటినం అవార్డు గెలుచుకుంది. ఇదే విభాగంలో స్వర్ణం దక్కించుకున్న 151 నగరాల్లో విజయవాడ, రాజమహేంద్రవరం స్థానం పొందాయి. రజతాన్ని 67 నగరాలు గెలుచుకోగా అందులో కడప, కర్నూలు, మదనపల్లె నిలిచాయి. కాంస్యం 143 నగరాలు గెలుచుకోగా వీటిల్లో జీవీఎంసీ విశాఖ ఉంది. పారిశుద్ధ్య పరిస్థితులను గమనించి ఈ అవార్డులనిచ్చారు.

* చెత్తరహిత నగరాలకు ఇచ్చిన స్టార్‌ ర్యాంకుల్లో విజయవాడ 5, విశాఖపట్నం 3స్టార్‌ హోదాను పొందాయి.

* ఏపీలో 96 నగరాలు ఓడీఎఫ్‌+, 4 ఓడీఎఫ్‌++, 3 వాటర్‌ప్లస్‌ సిటీలుగా గుర్తింపు పొందాయి.

* సపాయి కర్మచారులకు రుణాలిచ్చి యంత్రాల ద్వారా శుభ్రం చేయడానికి చేయూతనందిస్తున్న నగరపాలక సంస్థల్లో చిన్ననగరాల విభాగంలో నెల్లూరుకు తొలి ర్యాంకు దక్కింది.

* కరోనా సమయంలో రోగులను గుర్తించేందుకు ఇంటెలిజెంట్‌ మానిటరింగ్‌ అనాలిసిస్‌ సర్వీసెస్‌ క్వారెంటైన్‌ (ఐ-మాస్క్‌) అనే వినూత్న విధానం అవలంబించినందుకు పిఠాపురం మున్సిపాలిటీకి ఇన్నోవేషన్‌ విభాగంలో గుర్తింపు దక్కింది.

* దేశంలోని 659 జిల్లాలకు ర్యాంకులు ప్రకటించారు. అందులో విశాఖ 9, కృష్ణా 22, చిత్తూరు 84, తూర్పుగోదావరి 126, నెల్లూరు 167, కడప 168, విజయనగరం 188, కర్నూలు 202, గుంటూరు 211, శ్రీకాకుళం 273, ప్రకాశం 277, పశ్చిమగోదావరి 288, అనంతపురం 342వ ర్యాంకుల్లో నిలిచాయి.

ఇదీ చదవండి:బాధితులను త్వరితగతిన ఆదుకోండి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details