ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Viveka murder case: వివేకా హత్య కేసులో అన్నీ అనుమానస్పద మరణాలే..!

Viveka murder case:సీబీఐ అధికారులపైనే కేసులు.. ఊరు వదిలి వెళ్లిపోవాలనే హెచ్చరికలు.. అప్రూవర్‌గా మారినవారికి బెదిరింపులు.. అనుమానితులు, వాంగ్మూలం ఇచ్చినవారి అనుమానాస్పద మరణాలు.. తమకు రక్షణ కల్పించాలంటూ సాక్షుల వేడుకోలు.. మాజీమంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగవంతం అవుతున్నకొద్దీ ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలన్నీ అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

suspected deaths of witnesses in ex minister viveka murder case
వివేకా హత్య కేసులో అన్నీ అనుమానస్పద మరణాలే

By

Published : Jun 10, 2022, 7:06 AM IST

Viveka murder case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌రెడ్డి.. గురువారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ హత్యకేసులో ఇది రెండో మరణం. హత్య కేసులో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

అనుమానాస్పద మృతి.. ఇప్పటికీ నిగ్గుతేలని నిజం..వివేకా హత్యకేసులో అనుమానితుడిగా ఉన్న కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన కటికరెడ్డి శ్రీనివాసులురెడ్డి (57) 2019 సెప్టెంబరు 3న చనిపోయారు. విషపు గుళికలు సేవించి ఆత్మహత్య చేసుకున్నారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. తొలుత అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదుచేశారు. ఏం జరిగిందో ఇప్పటికీ నిగ్గు తేలలేదు. సిట్‌ ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి కీలక వ్యక్తుల్ని విచారిస్తున్న సమయంలో ఆయన మృతిచెందారు.

మరణానికి గుళికలే కారణమని నివేదికలో తేలింది. కానీ, ఆ మృతదేహంలో కాలేయానికి, కిడ్నీ మధ్యభాగంలో (హెపటో రీనల్‌పౌచ్‌)లో రక్తం ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్‌ నివేదిక తేల్చింది. ఎవరైనా దాడి చేయకపోతే ఆ భాగంలోకి రక్తం ఎలా చేరుతుందనే అనుమానాలను అప్పట్లోనే నిపుణులు వ్యక్తం చేశారు.

డీఎస్పీ వేధిస్తున్నారంటూ సీబీఐకి ఓ సాక్షి ఫిర్యాదు..శివశంకర్‌రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ సీబీఐ తనను బలవంతం చేసిందని అనంతపురం ఎస్పీకి కల్లూరు గంగాధర్‌రెడ్డి గతేడాది నవంబరు 29న ఫిర్యాదుచేశారు. అనంతపురం ఎస్పీ ఆ ఫిర్యాదును తాడిపత్రి డీఎస్పీ చైతన్యకు పంపించారు. ఈ వ్యవహారంలో చైతన్య తనను వేధిస్తున్నారంటూ వివేకా హత్యకేసులో సాక్షిగా ఉన్న జగదీశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి సీబీఐకి ఫిర్యాదుచేశారు.

సీబీఐ అధికారిపైనే పోలీసు కేసు..వివేకా హత్యకేసు కీలకదశకు చేరిన తరుణంలో ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు దర్యాప్తు అధికారి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పైనే కేసు నమోదుచేశారు. తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ రామ్‌సింగ్‌ తనను బెదిరిస్తున్నారని, దాడిచేశారని ఆరోపిస్తూ వివేకా హత్యకేసులో అనుమానితుడు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి ఫిబ్రవరి 15న పోలీసులకు ఫిర్యాదుచేశారు. తర్వాత కడప కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేశారు. దానిపై దర్యాప్తు చేయాలని కోర్టు సూచించటంతో కడప రిమ్స్‌ ఠాణా పోలీసులు రామ్‌సింగ్‌పై కేసు నమోదుచేశారు.

ఈ కేసు అక్రమమని ఆయన హైకోర్టును ఆశ్రయించటంతో కేసులో తదుపరి చర్యల్ని న్యాయస్థానం నిలిపేసింది. ప్రైవేటు ఫిర్యాదు రికార్డుల్నీ తమ ముందు ఉంచాలని కడప ఫస్ట్‌క్లాస్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది.

కడప నుంచి వెళ్లిపోండి.. లేదంటే బాంబు వేసి పేల్చేస్తాం..‘సీబీఐ బృందం వెంటనే కడప నుంచి తిరిగి వెళ్లిపోవాలి. లేకుంటే బాంబువేసి పేల్చేస్తా. ఈ విషయాన్ని మీ అధికారులకు చెప్పండి’ అంటూ ముసుగు ధరించిన ఓ వ్యక్తి తనను బెదిరించాడని సీబీఐ అధికారుల వాహన డ్రైవరు షేక్‌ వలీ బాషా కడప పోలీసులకు గత నెలలో ఫిర్యాదు చేశారు.

‘మాజీ మంత్రి వివేకా హత్యకేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి జైలులో ఉన్నంతవరకే సీబీఐ బృందం సురక్షితంగా ఉంటుంది. అతను బెయిలుపై బయటకు రాగానే సీబీఐ బృందాన్ని చంపేస్తాడు’ అంటూ తనను హెచ్చరించాడని, అంతకుముందు తన, సీబీఐ అధికారుల కదలికల గురించి కూడా చెప్పాడని ఆ ఫిర్యాదులో వివరించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తును పక్కన పెట్టేశారు.

నా ప్రాణాలకు ముప్పు: దస్తగిరి

‘నా ప్రాణాలకు ముప్పు ఉంది. వివేకా హత్యకేసులో కీలకసాక్షిగా ఉన్నందుకు ఏదో ఒకలా నన్ను అంతం చేయాలని పలురకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం కడప ఎస్పీకి, సీబీఐ ఎస్పీకి ఫిర్యాదు చేశా. నాకు ఏం జరిగినా వైకాపా నాయకులదే బాధ్యత’ అని అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి ఇటీవల వాపోయారు. గతనెల 30న కడప ఎస్పీకి ఫిర్యాదు చేశాక విలేకరులతో మాట్లాడారు.

తన హత్యకు కొందరు కుట్ర చేస్తున్నారని చెప్పారు. పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలానికి చెందిన పెద్ద గోపాల్‌ కొన్నాళ్లుగా తన కుటుంబసభ్యులతో గొడవ పడుతూ తనను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తర్వాత దస్తగిరిపై పోలీసులు పలు కేసులు నమోదుచేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details