ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ప్రకటించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని వెల్లడించారు. భాజపాను రాష్ట్రంలో బలోపేతం చేయాలని తనను అధిష్ఠానం ఆదేశించిందని పేర్కొన్నారు. తెదేపాతో కలిసి ఉండటం వల్లే రాష్ట్రంలో భాజపా ఎదగలేదని అభిప్రాయపడ్డారు. భాజపా కండువా కప్పుకున్న తరువాత తొలిసారిగా విజయవాడకు వచ్చిన ఆయన ఓ హోటల్లో పార్టీ నాయకులతో సమావేంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎవరు ఏం చేసినా ఏపీకి హోదా రాదు: సుజనా - direct politics entry
ఇటీవలే తెదేపా నుంచి భాజపా గూటికి చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి... రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చర్చనీయాంశమైన వ్యాఖ్యలు చేశారు.
'అన్ని రాష్ట్రాల్లో భాజపా జెండా ఎగురవేయాలని ప్రణాళికలు ఉన్నాయి. దీనికనుగుణంగానే ఏపీలోనూ అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలో కొత్త రాజకీయాలు చూస్తారు. భాజపాతోనే ఏపీలో అభివృద్ధి సాధ్యం' అని సుజనా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ స్నేహం లేదని అన్ని పార్టీలు తమకు ప్రత్యర్థులే అని స్పష్టం చేశారు.
ఎవరు ఏం చేసినా ఏపీకి ప్రత్యేకహోదా రాదని సుజనా స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని వదులకుందని.... ప్రస్తుత ప్రభుత్వం ఆ తప్పు చేయకుండా ప్యాకేజీలోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు 'హోదా ఇవ్వనప్పటికీ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేయలేదని బల్లగుద్ది చెబుతున్నా. కేంద్రంతో పోరాడితే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. కావాలని ఎవరినీ ఇబ్బందిపెట్టే ఉద్దేశంతో కేంద్రం పనిచేయదు' అని సుజనా పేర్కొన్నారు.