పదో తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల స్థానంలో మళ్లీ మార్కుల విధానాన్ని తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 2010లో తీసుకొచ్చిన గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికారు. ప్రవేశాలు, నియామకాల్లో ప్రతిభను గుర్తించేందుకు గతేడాది నుంచి మార్కులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఎక్కువమంది విద్యార్థులకు ఒకే గ్రేడ్ వచ్చినప్పుడు ప్రవేశాలు, నియామకాల్లో సమస్యలు వస్తున్నాయని.....ఈ కారణంగా గ్రేడ్ల స్థానంలో మార్కులు ఇవ్వాలని సంచాలకులు ప్రతిపాదనలు సమర్పించినట్లు వెల్లడించారు. 2019 మార్చి వరకు విద్యార్థులకు గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు ఇస్తారు. 2020 మార్చి నుంచి మార్కులు కేటాయిస్తారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలను నిర్వహించలేదు. ఈ ఏడాది ఇంటర్ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పదో తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు ఉన్నందున సీట్ల కేటాయింపు కష్టంగా మారింది. అంతర్గతంగా ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి మార్కులను తీసుకొని, ఆన్‌లైన్ ప్రవేశాలు నిర్వహించాలని మొదట భావించారు. విద్యార్థులకు మార్కులు ఇవ్వకుండా ఇంటర్ విద్యామండలికి ఇస్తే న్యాయ వివాదాలు వస్తాయని పరీక్షల విభాగం వెల్లడించింది. దీంతో ప్రభుత్వం గ్రేడింగ్ వ్యవస్థనే రద్దుచేసింది. తిరిగి మార్కుల విధానాన్ని తీసుకొచ్చింది. ఎన్నో ఏళ్లుగా విద్యార్థులో ఒత్తిడి తగ్గించేందుకు, ఆత్మహత్యల నివారణకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేశారు.
ssc marks: పదో తరగతిలో మళ్లీ మార్కులు - ఏపీ పదోతరగతి న్యూస్
పదో తరగతిలో మళ్లీ మార్కుల విధానం రానుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యాశాఖ అధికారి రాజశేఖర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ssc marks in the place of grades
Last Updated : Aug 28, 2021, 3:25 AM IST