విగ్రహాల విధ్వంసం వెనుక భాజపా నేతలు ఉన్నారంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధార ఆరోపణలు చేసిన డీజీపీని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దేవాయాల్లో విధ్వంసాలకు పాల్పడుతుంటే వాటిపై ఏ విధమైన చర్యలు తీసుకోకుండా..భాజపా కార్యకర్తలపై కేసులు నమోదు చేయటం దారుణమన్నారు. వైకాపా ప్రభుత్వం లక్ష్యం ఏమిటని సోము వీర్రాజు ప్రశ్నించారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. దేవాలయాల్లో విధ్వంస ఘటనలు జరిగితే స్పందించని పోలీసులు.. భాజపా కార్యకర్తలపై కేసులు పెట్టామని చెప్పడంలో డీజీపీ వైఖరి ఏమిటని నిలదీశారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి గౌతమ్ సవాంగ్‌ను డీజీపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
చర్చిలకు రూ.వేల కోట్ల ఆస్తులున్నప్పుడు... వాటిని ప్రభుత్వం ఎందుకు నిర్మించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. హిందూత్వాన్ని అస్థిరపరచడమే లక్ష్యంగా ప్రభుత్వ వైఖరి ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ ఆలయాల ఆస్తులు లెక్కించిందని.. అలాగే చర్చిల ఆస్తులు కూడా లెక్కించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చర్చిల ఆస్తులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం నిధులిచ్చే అంశంపై కేంద్రానికి నివేదిస్తామన్నారు.