స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య లేఖల యుద్ధం కొనసాగుతూనే ఉంది. పంచాయతీ ఎన్నికల ప్రోసీడింగ్స్ జారీ కన్నా ముందు అధికారులతో సమావేశం నిర్వహించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ....అంతకు ముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్‌కు లేఖ సంధించారు. హైకోర్టు ఉత్తర్వుల తర్వాతా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కాకుండా తాత్సారం చేసేందుకు ప్రయత్నించడం శోచనీయమంటూ లేఖలో పేర్కొన్నారు. 7వ తేదీన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నుంచి వచ్చిన లేఖలో ప్రస్తావించిన అంశాలు అభ్యంతరకరమని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు.ఎస్‌ఈసీ ఆదేశాలను మన్నించి ప్రభుత్వం తన అభిప్రాయాలను వెల్లడించినందుకు ధన్యవాదాలు చెబుతూనే ..ద్వివేది లేఖలో ప్రస్తావించిన ఒక్కో అంశంపైనా తీవ్రంగా స్పందించారు.
గతంలో ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుందని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత తిరుపతి ఉపఎన్నికల తర్వాతే స్థానిక ఎన్నికలు జరుగుతాయని.. ఏప్రిల్, మే మాసాల్లో ఇవి ఉండవచ్చని వ్యాఖ్యనించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తరహా తీరు కమిషన్ నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా ఉందన్నారు. ప్రస్తుత కమిషనర్ పదవిలో ఉండగా ఎన్నికలు నిర్వహించలేమంటూ సదరు సీనియర్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. ఎస్‌ఈసీ పదవీ విరమణ తర్వాతే ఎన్నికలు జరుగుతాయని ప్రచారం కూడా చేస్తున్నారని ..ఈ తరహా సమాధానమే ద్వివేది నుంచీ వ్యక్తంకావడం శోచనీయమని.... సీఎస్ కు రాసిన లేఖలో నిమ్మగడ్డ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా ఎన్నికల కమిషన్ ప్రజా ప్రయోజనాల ప్రకారమే వ్యవహరిస్తుందని ఎస్‌ఈసీ లేఖలో స్పష్టం చేశారు. ఎన్నికల సన్నద్ధతపై నిర్వహించే సమావేశానికి మరో తేదీ సూచించాలంటూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి చేసిన విజ్ఞప్తినీ తోసిపుచ్చుతున్నానని లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేకించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులనూ లేఖలో నిమ్మగడ్డ ప్రస్తావించారు.