ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

త్వరలో భాజపా పాదయాత్ర.. ఆ రోజునే ప్రారంభం : సత్యకుమార్‌

రాష్ట్రంలో త్వరలో భాజపా పాదయాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ నేత సత్యకుమార్‌ వెల్లడించారు. పండిట్ దీనదయాళ్ జయంతి రోజైన సెప్టెంబర్ 25న పాదయాత్ర ప్రారంభించేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు.

త్వరలో భాజపా పాదయాత్ర
త్వరలో భాజపా పాదయాత్ర

By

Published : Jul 10, 2022, 6:43 PM IST

Updated : Jul 11, 2022, 8:42 AM IST

రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని వైకాపాను తాము అడగలేదని భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌ స్పష్టం చేశారు. ఏ రకంగా చూసినా ఆ పార్టీ తమకు అంటరానిదేనని చెప్పారు. తమ పార్టీ జాతీయ నాయకత్వమూ వైకాపా మద్దతు కోరలేదని వెల్లడించారు. కేంద్ర మంత్రుల వెనుక ఎక్కడో నిల్చొని ఫొటోల్లో కనిపిస్తూ.. తాము భాజపాతో కలిసి ఉన్నామనే భ్రమను ప్రజల్లో కల్పించేందుకు వైకాపా నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదొక రకమైన మైండ్‌గేమ్‌ అని వివరించారు. సీఏఏ, వ్యవసాయ బిల్లుల విషయంలో పార్లమెంటులో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతిచ్చిన వైకాపా.. ఆ తర్వాత రాష్ట్రంలో వాటికి వ్యతిరేకంగా పలుచోట్ల ఆందోళనలు నిర్వహించిందని, భారత్‌ బంద్‌కూ మద్దతు తెలిపిందని వివరించారు. విజయవాడలో ఆదివారం భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. అనంతరం సత్యకుమార్‌ విలేకరులతో మాట్లాడారు.

సెప్టెంబరు 25 నుంచి భాజపా పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్‌ భాజపాశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబరు 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించాం. పండిట్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ఈ పాదయాత్ర చేపడతాం. దీనిద్వారా వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. త్వరలోనే దీనిపై రోడ్‌మ్యాప్‌ ప్రకటిస్తాం.

ప్లీనరీలో నిస్సిగ్గుగా జగన్‌ అబద్ధాలాడారు

‘వైకాపా ప్లీనరీలో ప్రజల కళ్లల్లోకి నేరుగా చూడకుండా నిస్సిగ్గుగా జగన్‌ అబద్ధాలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు 60 నుంచి 90 శాతం నిధులు కేంద్రం నుంచే వస్తున్నా ఆ విషయమే ప్రస్తావించలేదు.

* ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని గుర్తుచేస్తూ, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తూ మీడియాలో రాస్తుంటే వారిపైనా ఎదురుదాడి చేస్తున్నారు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హుడా? ఇచ్చిన హామీలను నెరవేర్చలేని ఫ్రస్టేషన్‌లో జగన్‌ ఉన్నారు. ముఖ్యమంత్రి భార్యే ఓ మీడియా సంస్థకు అధిపతిగా ఉన్నారు. అలాంటిది ఆ పార్టీ ప్లీనరీలో మీడియా సంస్థలను లక్ష్యం చేసుకోవటం ఏంటి?

* కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టలేకపోతోంది. జగన్‌ సొంత నియోజకవర్గమైన పులివెందులలో 18,700 మంజూరు చేస్తే 770 మాత్రమే కట్టారు. సొంత నియోజకవర్గ ప్రజల మధ్యకు వెళ్లటానికి కూడా జగన్‌ భయపడుతున్నారు. ఆ పరిస్థితి ఎందుకు ఉందో ఆత్మవిమర్శ చేసుకోవాలి’ అని సత్యకుమార్‌ పేర్కొన్నారు.

14న పౌర సరఫరాలశాఖ కార్యాలయాలవద్ద నిరసన: భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌

రాష్ట్రంలో వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కేంద్రం బియ్యం ఇవ్వడం లేదని ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతోంది. దీనిపై 14న అన్ని జిల్లా కేంద్రాల్లోని పౌర సరఫరాలశాఖ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం. 18న మండల స్థాయిలో రేషన్‌ డిపోల వద్ద ధర్నాలు చేస్తాం’ అని మాధవ్‌ పేర్కొన్నారు.

భాజపా, వైకాపా మధ్య ఎలాంటి సయోధ్య లేదు

భాజపా, వైకాపా మధ్య ఎలాంటి సయోధ్య లేదని... అలాంటిది ఉందని ఎవరైనా భావిస్తుంటే దాన్ని పోగొట్టాల్సిన బాధ్యత స్థానిక నాయకులదేనని భాజపా ముఖ్య నాయకులు స్పష్టం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మొదలుకుని కేంద్ర మంత్రుల వరకూ ప్రతి ఒక్కరూ వైకాపా ప్రభుత్వం పనితీరును తప్పుపడుతున్నారని.. అలాంటప్పుడు సయోధ్య ఉందని ఎలా అనుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పలువురు జిల్లా స్థాయి నాయకులు... వైకాపాతో భాజపాకు సయోధ్య ఉందన్న భావన కొంత మంది ప్రజల్లో ఉందని చెప్పగా వారు ఈ మేరకు స్పష్టం చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌, భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ముఖ్య నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, పీవీఎన్‌ మాధవ్‌, తదితరులు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ చేపట్టిన కార్యక్రమాలు, వాటి పురోగతిపై సమీక్షించారు. కోనసీమలో రైతులు పంట విరామం ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపైన చర్చించారు.

ఇవీ చూడండి :

Last Updated : Jul 11, 2022, 8:42 AM IST

ABOUT THE AUTHOR

...view details