విజయవాడ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న రౌడీ షీటర్ వడియార్ గణేశ్‌ను.. నగర బహిష్కరణ చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ శ్రీనివాసులు ఉత్తర్వులు జారీ చేశారు.
అజిత్ సింగ్ నగర్లో నివసిస్తున్న గణేశ్‌పై రౌడీషీట్ ఉంది. విజయవాడ కమిషనరేట్ పరిధిలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో గణేశ్‌పై మొత్తం 25 కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో జైలుకు సైతం వెళ్లొచ్చాడు. అయినా.. గణేశ్ ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో అతనిపై ఉన్నతాధికారులు నగర బహిష్కరణ విధించారు. జన జీవనానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.