జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో దాఖలైన వ్యాజ్యాలపై.. ఈనెల 23న విచారణ జరుపుతామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావు స్పష్టం చేశారు. మంగళవారం కోర్టు ప్రారంభ సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) తరఫు న్యాయవాది వివేక్ చంద్రశేఖర్.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వ్యాజ్యాలు ఈనెల 19న విచారణకు రావాల్సి ఉండగా జాబితాలో రాలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. శుక్రవారం విచారణ జరుపుతామని పేర్కొన్నారు.
పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ఇచ్చిందని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య వేసిన వ్యాజ్యంలో ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చి.. ఓట్ల లెక్కింపు పక్రియ నిలిపివేసిన విషయం తెలిసిందే. మరోవైపు సింగిల్ జడ్జి వద్ద జనసేన, భాజపా వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలు సైతం శుక్రవారం విచారణకు రానున్నాయి.