అయ్యో.. ఆ దేశంలో ఇంతమంది చనిపోతున్నారంటా.. ఈ దేశం కరోనాతో కంగారు పడిపోతుందటా.. ఈ కథలు చెప్పుకోవడం సరే.. మరీ నువ్వేం చేస్తున్నావ్ బాసూ. కాస్తైనా.. మెదడు పోరల్లోని తెలివిని వాడుతున్నావా? అదే బుర్ర ఉందా? ఏహే బయటకు పోతే.. పోయేదేముంది అనుకుంటున్నావా? ఒక్కసారి.. నువ్ అసత్య ప్రచారాలు చేసే సోషల్ మీడియానే తెరిచి చూడూ.. కరోనా రక్కసికి దేశాలకు దేశాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయక్కడ. చెప్పేది మీకే.. అర్థమవుతోందా?
జనతా కర్ఫ్యూ.. పూర్తయింది.. చప్పట్లు కొట్టాం. ఇక రోడ్లపై తిరగొచ్చు.. ఒక్కరోజు పాటించి.. ఏదో సాధించామన్న తిక్క మనకెందుకు. ఇదేనా నువ్వు ఆలోచించే తీరు. కొంపలోంచి బయటకు రాకుంటే.. ఏం మునిగిపోతుంది. మనమే.. పూర్తిగా మునిగిపోవాల్సి వస్తుంది. ఏళ్లకు ఏళ్లుగా బయట తిరుగుతున్నాం. కొన్ని రోజులు ఓపిక పట్టలేరా? బయట తిరగకుంటే.. నాకు తోచదంటారు ఒకరు. సిగరెట్ తాగకుంటే నేను ఉండలేనంటారు మరొకరు. ఇక కొంతమంది స్వయంప్రకటిత మేధావులైతే.. నిత్యావసరాలు అంటూ.. సొల్లు చెబుతారు. పోయేది నీ ప్రాణమే.. నువ్వు పోతే.. నీ కుటుంబ పరిస్థితి ఆలోచించు. నువ్వు చేసే పనికి కనీసం వారికి అన్నం కూడా దొరకదు. నీకు రోడ్లపై తిరిగే తిక్కుంటే.. కరోనాకు ఓ తిక్కుంది.. అందరినీ చంపేసే లెక్కుంది.