విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న సురేశ్ సెల్ఫీ వీడియో బహిర్గతమైంది. తమ కుటుంబం ఆత్మహత్యకు వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణమని సురేశ్ వీడియో ద్వారా తెలిపారు. వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధిక వడ్డీల కోసం జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఒత్తిడి తెచ్చాడని.. జ్ఞానేశ్వర్‌కు రూ.40 లక్షలకు పైగా వడ్డీలు చెల్లించినట్లు సురేశ్ విచారం వ్యక్తం చేశారు. వడ్డీలు చెల్లించినా.. ఇల్లు జప్తు చేస్తానని బెదిరించినట్లు సురేశ్ ఆరోపించారు. ప్రామిసరీ నోట్లపై భార్య, పిల్లల సంతకం చేయించుకున్నట్లు తెలిపారు.
అధిక వడ్డీల కోసం గణేశ్ అనే వ్యక్తి కూడా తమపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని చెప్పారు. గణేశ్‌కు రూ.82లక్షల వరకు చెల్లించినట్లు వాపోయారు. కొవిడ్ పరిస్థితుల్లో వ్యాపారం కోసం డబ్బు అప్పు తీసుకున్నామన్నారు. వడ్డీల మీద వడ్డీలు కట్టామని సురేశ్ వీడియోలో చెప్పారు. అయినా ఇంకా డబ్బులు కట్టాలని బెదిరించారని.. గూండాలతో తమపై దాడి చేయిస్తామన్నారని తెలిపారు. దీంతో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు. తన లాంటి బాధితులు చాలా మంది ఉన్నారని వీడియోలో వివరించారు.
ఏం జరిగిందంటే..?
ఈనెల 8న ఆత్మహత్యకు పాల్పడిన నిజామాబాద్‌కు చెందిన సురేశ్ కుటుంబం విజయవాడలో ఆత్మహత్య చేసుకుంది. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన కుటుంబం.. బలవన్మరణానికి పాల్పడింది. కన్యకాపరమేశ్వరి సత్రంలో తల్లి పప్పుల శ్రీలత(54) , కుమారుడు ఆశిష్(22) అతిగా ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి పప్పుల సురేష్(56), మరో కుమారుడు పప్పుల అఖిల్(28) కృష్ణా నదిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు.
ఈనెల 6న నిజామాబాద్ నుంచి విజయవాడ వచ్చిన కుటుంబం.. కన్యకా పరమేశ్వరి సత్రంలో పప్పుల అఖిల్ పేరుతో రూమ్ తీసుకుంది. తెలంగాణలోని నిజామాబాద్ నుంచి పప్పుల సురేష్ కుటుంబం ఈ నెల దుర్గమ్మ దర్శనానికి విజయవాడకు వచ్చారు. నగరంలోని వన్‌టౌన్‌లో ఉన్న కన్యకాపరమేశ్వరి సత్రంలో పప్పుల అఖిల్ పేరుతో కుటుంబం రూమ్‌ను అద్దెకు తీసుకున్నారు.
ఈనెల 8వ తేదీ తెల్లవారుజామున 2.30గంటల సమయంలో అప్పుల బాధతో చనిపోతున్నట్లు బంధువులకు మెసేజ్ పెట్టారు. బంధువులు స్పందించి సత్రం నిర్వాహకులకు ఫోన్ చేశారు. సత్రం సిబ్బంది, నిర్వాహకులు ఈ కుటుంబం ఉన్న రూమ్‌కు వెళ్లి చూడగా.. తల్లీ కుమారుడు విగతజీవులుగా కనిపించారు. తండ్రి, మరో కుమారుడు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనంతరం పోలీసులకు సమాచారం అందింది.
ఇదీ చదవండి: