రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల పాలకవర్గాలు నేడు ప్రమాణం చేయనున్నాయి. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి పేరును మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రకటించారు. మచిలీపట్నం మేయర్‌గా వెంకటేశ్వరమ్మ పేరు ఖరారు చేశారు. కృష్ణా జిల్లా తిరువూరు పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌గా కస్తూరిబాయి, వైస్ ఛైర్‌పర్సన్‌గా విజయలక్ష్మి పేర్లు ఖరారు చేశారు. రెండేళ్ల తర్వాత వేరే వారికి అవకాశం ఇచ్చేలా ఒప్పందం కుదిరింది.
గుంటూరు నగరపాలక మేయర్, ఇతర మున్సిపాల్టీల ఛైర్మన్ల ఎన్నికకు రంగం సిద్ధమైంది. గుంటూరు మేయర్‌గా కావటి మనోహర్‌నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఛైర్ పర్సన్‌గా నాగేంద్రమణి, వైస్ ఛైర్మన్‌గా వెంకటేశ్ పేర్లను మంత్రి విశ్వరూప్ ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నరసాపురం, నిడదవోలు మున్సిపాలిటీలకు ఛైర్ పర్సన్ల ఎంపిక ఇవాళ నిర్వహించనున్నారు. అన్ని స్థానాల్లోనూ పేర్లు దాదాపు ఖరారు కాగా... ఒక్క జంగారెడ్డిగూడెం విషయంలో పలు వర్గాలు పోటీ పడుతున్నాయి.
కడప నగరపాలక సంస్థ మేయర్‌గా సురేశ్ బాబు పేరు ఖరారైంది. డిప్యూటీ మేయర్ల పేర్లు వెల్లడి కావాల్సి ఉంది. తెలుగుదేశం అత్యధిక వార్డులు గెలుచుకున్న మైదుకూరు మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్‌లోని పుట్టా సుధాకర్‌యాదవ్ ఇంట్లో ఉన్న తెదేపా కౌన్సిలర్లు... మైదుకూరు చేరుకుని ఓటింగ్‌లో పాల్గొననున్నారు. కర్నూలు నగరపాలక సంస్థ మేయర్‌గా బీవై రామయ్య ఎన్నిక లాంఛనం కానుంది. నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీ విషయంలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.