విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం కడపాలెంలో తండ్రీ కుమారులు.. బాలికలపై అత్యాచారం చేసిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అత్యాచారాంధ్రప్రదేశ్గా మారిపోయిందని విమర్శించారు.
మహిళలకు రక్షణ కల్పించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ఆడబిడ్డల్ని బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. బాధితులే నిందితుల్ని గుర్తించాలనే మహిళా హోంమంత్రి అసమర్థ వ్యాఖ్యలు, కనీసం ఒక్క ఘటనలో కూడా నిందితులకు శిక్ష పడకపోవడం వల్లే కామోన్మాదులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాల కోసం పోలీసుల్ని వాడుకోవడం మానేస్తే.. నిందితులనైనా పట్టుకుంటారని దుయ్యబట్టారు.
అసలేం జరిగిందంటే..
పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన తండ్రే..ఇద్దరు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తండ్రే వక్రమార్గంలో పయనిస్తుంటే కుమారుడు ఊరుకుంటాడా.. అతను కూడా సమయం కోసం ఎదురుచూశాడు. ఆడిపిస్తానంటూ పిల్లలను దగ్గరకు తీసుకుని ఈ ఘాతుకానికి పాల్పడిన ఘటన విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో జరిగింది.
ఇద్దరు బాలికలపై తండ్రీకుమారులిద్దరూ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆటలు నేర్పిస్తామంటూ అఘాయిత్యానికి పాల్పడినట్లు.. బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత బాలికలను అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్ధలిని పోలీసులు, రెవెన్యూ, మహిళాశిశు సంక్షేమ అధికారుల బృందం పరిశీలించింది. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:
తొట్లకొండలో స్థూపాన్ని పునః ప్రారంభించిన మంత్రి అవంతి