తెలంగాణలోని నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గ పోరు కీలక ఘట్టానికి చేరుకుంది. కొవిడ్ నిబంధనల మధ్య సాగర్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఓటర్లు, సిబ్బంది కరోనా నిబంధనలు పాటించేలా ఈసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన 346 ఓటింగ్ కేంద్రాల్లో 3వేల 145 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు.
కరోనా నేపథ్యంలో ప్రతీ పోలింగ్ కేంద్రంలో శానిటైజర్ ఏర్పాటు చేశారు. 2 లక్షల 20 వేల 3 వందల మంది ఓటర్లున్న నియోజకవర్గంలో... లక్షా 9 వేల 228 మంది పురుషులు, లక్షా 11 వేల 72 మంది మహిళలున్నారు. మొత్తం 41 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా... తెరాస నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, భాజపా తరఫున రవికుమార్ బరిలో ఉన్నారు.