MP Raghurama:తన హత్యకు కుట్ర జరుగుతోందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఝార్ఖండ్ వ్యక్తులతో తనను చంపించేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి మారుపేరుగా మారిన సీబీసీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్.. సీఎం జగన్‌తో కుమ్మక్కై తనను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రధాని నరేంద్రమోదీకి రెండు పేజీల లేఖ రాశారు.
‘ఇటీవల నేను సొంత పార్లమెంట్ నియోజకవర్గం నరసాపురం వెళ్లాలనుకున్నప్పుడు చంపేందుకు కుట్ర పన్నారు. వివిధ మత విధానాలను అనుసరిస్తున్న వారి ద్వారా ఎస్సీ కులాల మధ్య చిచ్చురేపి ఆ సందర్భంలో ఝార్ఖండ్ నుంచి తెప్పించిన గూండాల ద్వారా అల్లర్లు సృష్టించి ఆ అలజడి మధ్య నన్ను అంతమొందించేందుకు ప్రణాళిక రూపొందించారు. సునీల్‌కుమార్ అసాంఘిక కార్యకలాపాల్లో మునిగి తేలుతూ రాజకీయ లబ్ధి కోసం హిందూ వ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోని అంబేడ్కర్ ఇండియా మిషన్ ద్వారా నాకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసుస్టేషన్లలో తప్పుడు కేసులు పెట్టేలా పలువురిని ప్రోత్సహించారు. తద్వారా నన్ను కేసుల్లో ఇరికించి విచారణకు హాజరైనప్పుడు భౌతికంగా హత్య చేయాలని కుట్ర పన్నారు' అని లేఖలో రఘురామ పేర్కొన్నారు.
'దీనిపై ఇప్పటికే ఎన్నోసార్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, హోంశాఖలకు వీడియోసాక్ష్యాలతో సహా ఫిర్యాదుచేశా. ఆ శాఖలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం కోరినా రాష్ట్రం స్పందించలేదు. గతేడాది మే 14న అరెస్టు చేసినప్పుడు పోలీసు కస్టడీలో చిత్రహింసలుపెట్టి నన్ను అంతమొందించాలన్న వారి ప్రయత్నం విఫలం కావడంతో ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నాలకు ఒడిగడుతున్నారు. అందువల్లే విధిలేని పరిస్థితుల్లో మళ్లీమళ్లీ మీ తలుపు తట్టాల్సి రావడం నా దురదృష్టం. వీరిద్దరూ నాకు ప్రాణహాని తలపెట్టినట్లు స్వీయమార్గాలు, సామాజిక నిఘా వర్గాల ద్వారా తెలిసింది. ఈ కుట్రలో ఏపీ ప్రభుత్వ ముఖ్యసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాలుపంచుకున్నారు. నన్ను చిత్రహింసలకు గురిచేసిన పీవీ సునీల్‌కుమార్‌పై గతేడాది జూన్ 2న లోక్‌సభ స్పీకర్‌కు ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసుపైనా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నా. గత్యంతరం లేకనే మీకు మొరపెట్టుకోవాల్సి వచ్చింది’ అని రఘురామ తన లేఖలో పేర్కొన్నారు.
"సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ నుంచి తనకు ప్రాణహాని ఉంది. సీఎం జగన్‌తో కుమ్మక్కై తనకు ప్రాణహాని తలపెట్టారు. సునీల్‌కుమార్ ఆధ్వర్యంలోని సంస్థతో తనపై కేసులు పెట్టించారు. కేసుల విచారణకు పిలిచి తనను చంపాలని ప్రణాళిక రచించారు. గతేడాది మే 14న కస్టోడియల్ టార్చర్‌కు గురిచేశారు. గుంటూరు జైలులో తనను చంపేందుకు కుట్ర పన్నారు. సీఎం నిర్ణయాలను విమర్శిస్తున్నాననే భౌతిక దాడికి యత్నిస్తున్నారు. తనను చంపే కుట్రలో సజ్జల కూడా ఉన్నారు. ఈ కుట్రపై ఎన్‌ఐఏ వంటి సంస్థతో విచారణ జరిపించాలి." - రఘురామ ఎంపీ
గొంతుకోసి హతమార్చడం అమానుషం: పల్నాడులో తెదేపా నేత తోట చంద్రయ్యను పట్టపగలు నడిబజారులో గొంతుకోసి హతమార్చడం రాష్ట్రంలోని ఆటవిక పాలనకు అద్దం పడుతోందని ఎంపీ రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఇదే పల్నాడులో ఓ ఎమ్మెల్యేపై రైతు హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తప్పుడు కేసు పెట్టారని వివరించారు. ఏఎస్పీ స్థాయి నివేదికతో సీఐపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. తప్పుడు కేసుతో రిమాండ్‌లో ఉన్న రైతును మాత్రం విడుదల చేయలేదని విమర్శించారు. తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌పై స్పందించిన లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ తనను దారుణంగా హింసించిన పోలీసులపై ఇంతవరకూ స్పందించకపోవడం పట్ల స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాసినట్లు చెప్పారు. బండి సంజయ్‌ను అరెస్టు చేసిన అంశంపై తక్షణం స్పందించడాన్ని అభినందిస్తున్నానని.. అలాగే తనను పోలీసుల చెరలో హింసించిన సంఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని 8 నెలల కిందట ఇచ్చిన ఫిర్యాదుపైనా స్పందించాలని కోరారు.
CID Notice To RRR: హైదరాబాద్‌లోని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఈనెల 12న (బుధవారం) ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులిచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎంపీ నివాసానికి వెళ్లారు. ఈనెల 17వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ముందుగా నోటీసులు తనకు ఇవ్వాలని.. రఘురామ కుమారుడు కోరగా.. ఎంపీకే నోటీసులు ఇస్తామని సీఐడీ అధికారులు స్పష్టంచేశారు. అనంతరం రఘురామకు నోటీసులు ఇచ్చి అధికారులు వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: