తెలుగు రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి వెళ్లే విమాన, రైల్వే ప్రయాణంపై ఆంక్షలు ఎత్తేయాలని దిల్లీ ప్రభుత్వానికి తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. కరోనా కేసులు ఉద్ధృతంగా ఉన్న సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణీకులు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ లేదా రెండో డోసుల టీకా పూర్తైనట్లు రిపోర్టు చూపాలని లేని పక్షంలో 14 రోజుల క్వారంటైన్‌కు పంపాలని దిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖంలో ఉన్నాయని..తెలుగు రాష్ట్రాల్లోనూ రోజురోజుకు కరోనా ప్రభావం తగ్గుతున్నందున గతంలో జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కనకమేడల.. దిల్లీ ప్రభుత్వాన్ని కోరారు.
దేశంలో ఏ రాష్ట్రానికి పెట్టని నిబంధన కేవలం తెలుగు రాష్ట్రాలకే పెట్టడం దురదృష్టకరం అన్నారు. వెంటనే ఆంక్షలు ఎత్తివేసేలా చర్యలు చేపట్టాలని దిల్లీ లెప్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు విడివిడిగా లేఖలు రాశారు. దిల్లీలో అత్యవసర పని కోసం వచ్చే వారు, విదేశీ రాయబార కార్యాలయాల్లో వీసా కోసం వచ్చే వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా..పునరాలోచన చేయాలని లేఖలో కోరారు.