రాష్ట్రంలో రూ. 40వేల కోట్లతో 3వేల 787 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ డబ్లింగ్ పనులు జరుగుతున్నాయని రైల్వే శాఖ పార్లమెంటుకు తెలియజేసింది. రైల్వే ప్రాజెక్టులు జోన్ల వారీగానే జరుగుతాయని..రాష్ట్రాల వారీగా చేపట్టడం లేదన్నారు. ఒక్కో జోన్‌లో విభిన్న రాష్ట్రాల సరిహద్దులు ఉంటాయని ఆ శాఖ మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పూర్తిగా, పాక్షికంగా వచ్చే 16 డబ్లింగ్ ప్రాజెక్టుల కింద 3,787 కిలోమీటర్ల మార్గాన్ని 40వేల 64 కోట్ల రూపాయలతో మార్చుతున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే 206 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. రాజ్యసభలో ఎంపీ సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
2020 మార్చి నాటికి ఖర్చు..
2020 మార్చి నాటికి ఈ ప్రాజక్టులపై 7వేల 121 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. 2017-18 నుంచి 2019-20 మధ్య కాలంలో గుంటూరు-తెనాలి 24 కి.మీ, గుంటూరు-కల్లూరు 43 కి.మీ డబ్లింగ్ పనులు పూర్తిస్థాయిలో మొదలయ్యాయన్నారు. డబ్లింగ్ కిందకు చేర్చిన 16 ప్రాజెక్టుల్లో నాలుగు ప్రాజెక్టులను గత మూడేళ్లుగా నిధుల కేటాయింపుల వివరాలను తెలిపారు. పెనుగొండ-ధర్మవరం మార్గంలో 41.5కి.మీ ప్రాజెక్టును 2018-19 బడ్జెట్‌లో రూ.308 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టినట్లు చెప్పారు.
2019-20 బడ్జెట్‌లో..
- ధర్మవరం-పాకాల-కాట్పాడి మార్గంలో 290 కి.మీ ప్రాజెక్టుకు రూ. 2వేల 900 కోట్లు
- గుంటూరు-బిబినగర్ మార్గంలో రూ. 248 కి.మీ ప్రాజెక్టుకు 2వేల 480 కోట్లు
- అకోలా-డోన్ వయా పూర్ణముద్కేడ్, సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ మార్గంలో 626 కి.మీ ప్రాజెక్టుకు 6వేల 260 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పొందుపరిచామని మంత్రి వివరించారు.
విశాఖ రైల్వే జోన్ ఎప్పడో చెప్పలేం..
విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేమని మంత్రి పీయూష్‌గోయల్ చెప్పారు. ఈ జోన్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ ప్రస్తుతం రైల్వే బోర్డు పరిశీలనలో ఉందని, అందువల్ల కొత్త రైల్వేజోన్ ప్రారంభానికి కచ్చితమైన సమయాన్ని నిర్దేశించలేమని పేర్కొన్నారు. భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన ఈమేరకు సమాధానమిచ్చారు. వైజాగ్ డివిజన్‌ను ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి వచ్చే ప్రాంతాలతోనే కలిపి ఉంచేలా డీపీఆర్‌ను ఏమైనా సవరించారా? అన్న ప్రశ్నకు పీయూష్ గోయల్ ‘లేదు’ అని సమాధానమిచ్చారు. అందువల్ల సవరించిన డీపీఆర్‌ను ఆమోదించే ప్రసక్తే ఉత్పన్నంకాదని చెప్పారు.
తిరుపతి, నెల్లూరు రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు చర్యలు
తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులకు సంబంధించి ప్రస్తుతం రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ ఖరారైనట్లు పీయూష్‌గోయల్ తెలిపారు. ఈ స్టేషన్ల అభివృద్ధి పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించిన నాటి నుంచి మూడేళ్లలో పూర్తిచేయాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. విశాఖపట్నం, విజయవాడ స్టేషన్లను అభివృద్ధికి సాంకేతిక, ఆర్థికపరంగా ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ స్టేషన్ల అభివృద్ధి కోసం రైల్వేశాఖ ఎలాంటి నిధులు ఖర్చుచేయదని, పూర్తిగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానంలోనే చేపడుతుందని స్పష్టంచేశారు.
ఇదీ చూడండి:విశాఖ జోన్‌పై తుది నిర్ణయానికి కాలపరిమితేం లేదు: కేంద్రం