MINISTER BUGGANA:‘మత్తు పానీయాలపై వచ్చే పన్నులు, ఆదాయం ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌పై (ఏపీఎస్‌డీసీ) రుణం తీసుకువచ్చాం. దానిపై చట్టం చేశాం. అందులో దాపరికం ఏం లేదు. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతు భరోసా, ఆసరా, చేయూత, అమ్మఒడి పథకాలకు వాడతామని చెప్పాం. అలానే వాడుతున్నాం...’ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. దిల్లీ ఏపీ భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
పొరుగున ఉన్న తెలంగాణతో సహా ఏ రాష్ట్రంతో పోల్చినా ఆంధ్రప్రదేశ్ అప్పులు తక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. ‘విభజిత ఆంధ్రప్రదేశ్‌కు 2014లో రూ.1.35 లక్షల కోట్ల అప్పు ఉంటే... 2019, మే నాటికి అది ఏకంగా రూ.3.27 లక్షల కోట్లకు పెరిగింది. 2022 నాటికి మూడేళ్ల తర్వాత రూ.4.98 లక్షల కోట్లకు చేరుకుంది. 2014-15లో 3.95% ద్రవ్యలోటు ఉంటే... 2021-22 నాటికి దానిని తాము 3 శాతానికి తగ్గించాం. 2014-15లో రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.13,776 కోట్లుగా ఉంటే... మా ప్రభుత్వం దానిని రూ.8,500 కోట్లకు తగ్గించింది...’ అని మంత్రి బుగ్గన తెలిపారు. తెలంగాణ రెవెన్యూ మిగులు నుంచి రూ.4,400 కోట్ల రెవెన్యూ లోటుకు వెళ్లిందన్నారు. ‘చంద్రబాబు నాయుడు హయాంలో స్థూల ఉత్పత్తిలో పెరుగుదల 11 శాతంగా ఉంటే... మా ప్రభుత్వ హయాంలో అది 18 శాతంగా ఉంది.