విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సరిపడా పడకలు అందుబాటులో లేకపోవడంతో కరోనా లక్షణాలతో వచ్చిన కొంతమంది రోగులు ఆవరణలోనే కన్నుమూస్తున్నారు. ఆదివారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నం బచ్చుపేట ప్రాంతం నుంచి అనారోగ్యంతో ఉన్న శ్రీనివాసు అనే వ్యక్తిని అతని కుమారుడు ఇక్కడికి తీసుకొచ్చారు. పడకలు లేవని.. వేచి ఉండమని చెప్పడంతో అదే ఆవరణలోనే ఉన్నారు.
కుమారుడి కళ్ల ముందే ఆగిన తండ్రి ఊపిరి - corona news in vijayawada
మచిలీపట్నం బచ్చుపేట ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కరోనాతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మృతి చెందాడు. ఆసుపత్రిలో బెడ్ ఇస్తే తన తండ్రి బతికి ఉండేవాడంటూ కుమారుడు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
సోమవారం ఉదయం వరకు ఆసుపత్రిలో చేర్చుకోలేదు. ఊపిరాడక ఇబ్బందిపడుతున్న తండ్రి ఆవేదన చూడలేక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళదామని అంబులెన్స్‌లు, ఆటోల కోసం ప్రయత్నించినా కరోనా భయంతో ఎవరూ ముందుకు రాలేదు. వైద్యులు ఎవరైనా బయటకు వచ్చి తన తండ్రిని చూడాలని వేడుకున్నా ఫలితం కనిపించలేదు. అప్పటివరకు మాట్లాడిన తండ్రి ఒక్కసారిగా ఉలుకుపలుకు లేకుండా ఉండటంతో ‘నాన్నా మాట్లాడు.. నీళ్లు తాగు’ అని కుమారుడు విలపిస్తుండగా అక్కడే ఉన్న రెడ్‌క్రాస్ వాలంటీరు వచ్చి గుండెపై అదిమి చూసి ప్రాణం పోయిందని చెప్పాడు. ఆసుపత్రిలో బెడ్ ఇస్తే తన తండ్రి బతికేవాడంటూ కుమారుడు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.