పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కోరుతూ.. ప్రకటించాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. రికవరీ రేట్లను అధికంగా నమోదు చేయటానికి బాధిత రోగులను త్వరగా డిశ్చార్జ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మూర్ఛ బారిన పడిన బాధితులు ఎక్కువ ప్రభావానికి గురవుతున్నారన్న లోకేశ్..., రోగులకు ప్రభుత్వాసుపత్రులపై ఉన్న నమ్మకాన్ని వైకాపా ప్రభుత్వ చర్యలు నీరుగారుస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా...ప్రజలను కాపాడేందుకు కేంద్రం జోక్యం అవసరమన్నారు. వ్యాధి మళ్లీ పునరావృతం కాకుండా చూడటం అందరి బాధ్యతగా పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా ఏలూరులో ఆరోగ్య సంక్షోభం నెలకొందని అన్నారు.
వందలాది మంది అపస్మారక స్థితిలో ఉన్నారని...,క్షేత్రస్థాయిలో బాధితుల కష్టాలను స్వయంగా చూసిన తాను ఎంతో ఆవేదన చెంది షాక్‌కు గురయ్యానని లోకేశ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ స్పందన అంతంతమాత్రంగానే ఉందని విమర్శించారు. అత్యవసర పరిస్థితిగా పరిగణించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యాధికి గల మూలాలు ఇంకా తెలియలేదని.., దీనిపై రాష్ట్ర ప్రభుత్వమూ అంతగా శ్రద్ధ పెట్టలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి నెలకొన్నా...అధికారులు తగు రీతిలో స్పందించలేదని ఆరోపించారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోకుండా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ తరహా సంఘటనలు పునరావృతమైతే...నిరోధించడానికి దీర్ఘకాలిక చర్యలు ఎక్కడా లేవని విమర్శించారు. ప్రస్తుత ఏలూరు ఘటన మానవ విషాదంగా మారకుండా ఎలా నియంత్రించాలో అధికారులకు తెలియదని లేఖలో పేర్కొన్నారు.