ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లాక్​డౌన్ తర్వాత పరిమిత రైళ్లే

లాక్‌డౌన్‌ ముగిసిన మరుసటి రోజు నుంచే రైళ్లలో వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో రిజర్వేషన్‌ చేయించుకుంటున్నవారికి.. ప్రయాణించే అవకాశాలు కనిపించడం లేదు. కరోనా వైరస్‌ తీవ్రత, ఆయా ప్రాంతాల్లో పరిస్థితుల ఆధారంగా ఆయా డివిజన్లలో రెండు, మూడు రైళ్లకు మించి నడపబోరని తెలుస్తోంది. ఈ మేరకు వివిధ ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తు చేస్తున్నారు.

lock down effect on railway
lock down effect on railway

By

Published : Apr 10, 2020, 5:30 AM IST

లాక్‌డౌన్‌ ముగిశాక రైల్వేశాఖ దశల వారీగా రైళ్లను పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్‌ సిటీ రైళ్లను నడిపే ఆలోచన చేస్తున్నారు. విజయవాడ నుంచి విశాఖ, విజయవాడ నుంచి తిరుపతి లేక గూడూరు వంటి ప్రాంతాలకు రోజుకు ఒకటి, రెండు రైళ్లనే నడపనున్నారు. ఈ మార్గాల్లో ప్రస్తుతమున్న రత్నాచల్‌, జన్మభూమి, పినాకిని వంటి ఇంటర్‌సిటీ రైళ్ల స్థానంలో, కొత్త నంబరు కేటాయించి ప్రత్యేక రైళ్లు నడపుతారు. వీటిలోనూ అన్నీ రిజర్వేషన్‌ బోగీలే ఉంటాయని, కొద్ది రోజులు జనరల్‌ బోగీలు లేకుండా చూస్తారని సమాచారం. రిజర్వేషన్‌ బోగీలో వెళ్లిన వారికి తర్వాత కరోనా పాజిటివ్‌ వస్తే, అందులో మిగిలిన ప్రయాణికులను గుర్తించేందుకు వీలుగా ఈ జాగ్రత్త తీసుకుంటున్నారు. ఈ బోగీలో సైతం 30 నుంచి 40 శాతం సీట్లనే కేటాయిస్తారు. మిగిలినవి ఖాళీగా ఉంచి, ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయనున్నారు.

ఏ రంగు జోన్‌ అనేదే కీలకం

కరోనా వైరస్‌ తీవ్రతను బట్టి దేశ వ్యాప్తంగా రైల్వే డివిజన్లను మూడు జోన్లుగా విభజించే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటికి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ జోన్లుగా గుర్తిస్తారు. ఎరుపు రంగు జోన్‌ పరిధిలో ఉండే డివిజన్లలో రైళ్లు నడిపే అవకాశం ఉండదని, పసుపు రంగు జోన్‌ పరిధిలో కొంత వరకు, ఆకుపచ్చ జోన్‌లో ఎక్కువ రైళ్లను నడిపే వీలుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి తెలంగాణను ఎరుపు రంగు జోన్‌గా గుర్తించినట్లు సమాచారం. లాక్‌డౌన్‌ ముగిసినా సరే తెలంగాణలో వెంటనే రైళ్లు నడిచే అవకాశం లేదని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఏపీ నుంచి కూడా హైదరాబాద్‌కు రైళ్లు తిరగవని తెలిసింది. విజయవాడ డివిజన్‌ పసుపు లేక ఆకుపచ్చ జోన్‌లో ఉండే అవకాశం ఉందని, దీని పరిధిలో పరిమితంగా రైళ్లు నడుపుతారని పేర్కొంటున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో రైళ్లు నడపటంపై అధికారుల నుంచి స్పష్టత రానుంది.

ఇదీ చదవండి: ఒక్కరోజే 15 పాజిటివ్ కేసులు.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details