ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

How Ramappa Temple became heritage: రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఎలా దక్కింది? - ramappa temple history

తెలంగాణలోని ఓరుగల్లు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న సమయం ఎట్టకేలకు వచ్చింది. అపురూప అద్భుత చారిత్రక కట్టడం రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. ఈ గుర్తింపుతో ఓరుగల్లు మురిసిపోయింది. ఇంతకీ ఈ ఆలయం చరిత్ర ఏంటి? ప్రపంచ గుర్తింపు పొందేలా ఇక్కడేముంది? ఈ గుర్తింపు రావడానికి కారణమెవరు?

unesco recognition for ramappa temple
రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఎలా దక్కింది?

By

Published : Jul 26, 2021, 12:21 PM IST

ఓరుగల్లు ప్రజలు పులకరించిపోతున్నారు. ఎన్నో ఏళ్ల తమ స్వప్నం నిజమైన తరుణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా.. ప్రస్తుత ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప ఆలయానికి యునెస్కో.. ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వడంతో యావత్​ తెలంగాణ మురిసిపోయింది. కాపాడుకుంటే విశ్వవాప్త గుర్తింపు పొందే ఎన్నో కట్టడాలు తెలంగాణ సిగలో తొణికిసలాడుతున్నాయి.

రామప్ప ఆలయ చరిత్ర..

1213లో కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో సుమారు 110 సంవత్సరాల పాటు ధూపదీప నైవేద్యాలతో వైభవంగా పూజలు కొనసాగాయి. ముస్లిం రాజుల దండయాత్రతో కాకతీయుల ప్రస్థానం ముగియడంతో సుమారు 550 సంవత్సరాల పాటు ఎలాంటి ఆదరణ లేక చిట్టడవుల్లో, కారుచీకట్లలో కమ్ముకుపోయింది. నిజాం రాజుల దగ్గర పనిచేసే సామంత రాజు ఆసీఫ్‌జాహీల్‌ వేటకు వచ్చిన సమయంలో ఆలయం ఆయన కంట పడింది.

1900లో ఆయన దానిని గుర్తించి దేవాలయం అంచులు పడిపోకుండా సిమెంట్‌ దిమ్మెలను ఏర్పాటు చేయించారు. పరిసరాలను పరిశుభ్రం చేసి వెలుగులోకి తీసుకువచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1951లో పురావస్తు శాఖ దీనిని ఆధీనంలోకి తీసుకుంది. అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సవాల్‌గా తీసుకుని యునెస్కో మెప్పు పొందేలా తీర్చిదిద్దారు. దీంతో ఇప్పుడు ప్రపంచ వారసత్వ హోదా సాధ్యమైంది.

అడుగులు పడ్డాయిలా..

  • యునెస్కో గుర్తింపు దక్కిందంటే దాని వెనకాల ఎంతో మంది ప్రయాస, ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 ఏళ్లుగా ఎంతో ఓపిగ్గా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు సభ్యులు కృషి చేశారు. ప్రతి దశను దాటుతూ ఆదివారం లక్ష్యాన్ని చేరుకున్నారు. 2010 నుంచి 2021 వరకు ఒక్కో అడుగు ఎలా పడిందో ఓసారి పరిశీలిద్దాం.
  • 2010 - కాకతీయులు నిర్మించిన కట్టడాలు యునెస్కో గుర్తింపు పొందాలనే యోచనతో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.
  • 2012 - రామప్పతో పాటు పలు గుళ్ల విశేషాలను చెబుతూ యునెస్కోకు పంపేందుకు ఒక ప్రతిపాదన తయారు చేశారు. మిగతావి యునెస్కో నిబంధనలకు తగ్గట్టు లేవని దీన్ని విరమించుకొన్నారు.
  • 2016 - టెంటెవివ్‌ జాబితాలో చేర్చేందుకు సమగ్ర వివరాలతో పుస్తకాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు.
  • 2018 - ఆలయ ప్రత్యేకతలన్నీ పొందుపరుస్తూ తుది డోసియర్‌ (వివరాలు, పటాలు, చిత్రాలతో కూడిన పుస్తకం)ను ప్యారిస్‌లోని యునెస్కో కార్యాలయానికి పంపారు.
  • 2019 సెప్టెంబరు 25 - యునెస్కో ప్రతినిధి వాసు పోష్యనందన ఇక్కడికి వచ్చారు. గుడిని సందర్శించి గుర్తింపునకు అర్హత ఉందా.. అనే కోణంలో రెండు రోజుల పాటు అణువణువూ పరిశీలించారు.
  • 2019 నవంబరు 22 - కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు సభ్యుడు పాండురంగారావు, విశ్రాంత ఐఏఎస్‌, ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఆర్కిటెక్ట్‌ సూర్యనారాయణ మూర్తి ప్యారిస్‌కు వెళ్లారు.
  • 2020 జులై - కరోనా వల్ల చైనాలో జరగాల్సిన ఓటింగ్‌ ప్రక్రియ వాయిదా పడింది.
  • 2021 జూన్‌ 23 - హోదాపై మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలిశారు.
  • జులై 6 - గుడి చిత్రాలు అధికారిక వెబ్‌సైట్లో పొందుపరిచిన యునెస్కో.
  • జులై 16 - చైనాలోని ఫుజి వేదికగా హెరిటేజ్‌ కమిటీ సమావేశం ప్రారంభం.
  • జులై 25 - ప్రపంచ వారసత్వ హోదా ఇస్తూ యునెస్కో ప్రకటన.

గుర్తింపు వెనుక ఆయన!

రామప్పకు ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు రావడానికి కీలకమైన వ్యక్తి వాసుపోష్యనందన.. 2019 సెప్టెంబరు 24వ తేదీన యునెస్కో తరఫున ఆయన వరంగల్‌ నగరానికి చేరుకున్నారు. హంగులు ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా, ఒంటరిగా వచ్చారు. మూడు రోజుల పాటు నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో బస చేశారు. జిల్లాకు చెందిన అధికారులతో రామప్పకు వెళ్లి వచ్చేవారు. క్షేత్రస్థాయి సిబ్బందితో సైతం భాష తెలియనప్పటికీ నవ్వుతూ పలకరించేవారు. పర్యటన ముగిసి వెళ్లే రోజున తన గుర్తుగా హరిత హోటల్‌లో మొక్క నాటారు. ఆయన సానుకూల ప్రతిపాదనలు ప్రపంచ గుర్తింపునకు కారణమయ్యాయి.

శిల్పి పేరుతో..

సాధారణంగా ఆలయాలు దేవుడి పేరుతో ప్రాచుర్యం పొందుతాయి. కాకతీయులు కట్టించిన ఆలయాలకు ఆయా రాజుల పేర్లుంటాయి. కానీ రామప్ప ఆలయం మాత్రం శిల్పి పేరుతో ప్రసిద్ధిచెందింది. కాకతీయుల రాజు గణపతి దేవుడి పాలనలో రేచర్ల రుద్రుడు కట్టించినా రామప్ప అనే శిల్పి పేరుతోనే వాడుకలో ఉంది. రామప్ప కర్ణాటక నుంచి వచ్చినట్లు చెబుతారు. అద్భుతమైన శిల్పకళ ప్రదర్శించడంతో శిల్పి పేరును పెట్టినట్లు జానపదాల్లో ప్రతీతి.

  • కట్టించిన వారు: గణపతి దేవుడు
  • నిర్మాణ బాధ్యతలు: కాకతీయసైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు
  • శిల్పి: కర్ణాటకకు చెందిన రామప్ప
  • పనులు ప్రారంభం: 1173
  • పూర్తయింది: 1213

కాపాడుకుంటే మరెన్నో...

కాకతీయులు నిర్మించిన అద్భుత కట్టడం రామప్ప ఆలయానికి ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా దక్కడం చాలా సంతోషకరం. ఉమ్మడి వరంగల్‌ ప్రాంతంలో ఇంకా అనేక ప్రాచీన ఆలయాలు, కట్టడాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు సంరక్షణ లేక రోజురోజుకు శిథిలమైపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో రామప్పతోపాటు, వేయిస్తంభాల గుడి, వరంగల్‌ కోట మూడు ప్రాచీన కట్టడాలు కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నాయి. వీటితోపాటు కొన్ని రాష్ట్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉండగా, కొన్ని ఎవరి సంరక్షణలో లేకపోవడం శోచనీయం. ములుగు సమీపంలో ఉన్న దేవునిగుట్ట చాలా అద్భుతమైన నిర్మాణం. కాంబోడియాలోని అంకోర్‌వాట్‌ను తలపించే ఈ నిర్మాణం కాకతీయుల కట్టడాల కన్నా పురాతనమైంది. కానీ ఇది నిరాదరణకు గురవుతోంది. దీంతోపాటు గణపురంలోని కోటగుళ్లు, గీసుకొండ వద్దనున్న ఏకవీర ఆలయం, రఘునాథపల్లి మండలంలోని త్రికూటాలయం, ధర్మసాగర్‌ వద్దనున్న కాకతీయుల నాటి మరో ఆలయంతో పాటు ఉమ్మడి వరంగల్‌లో శిథిలమైపోతున్న ప్రాచీన ఆలయాలు, మెట్లబావులు, చారిత్రక వింతలు ఎన్నో ఉన్నాయి. వీటిని కాపాడుకోవడం ఎంతో ఆవశ్యకం.

పురావస్తు శాఖ దృష్టిసారిస్తే:

కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆలయాలు కూడా కబ్జాలకు గురి కావడం శోచనీయం. వరంగల్‌ కోట చుట్టూ వంద మీటర్లు నిషేధిత స్థలం ఉన్నా స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లు వేస్తూ ఆక్రమణల పర్వం కొనసాగిస్తున్నారు. మట్టి కోట చుట్టూ కబ్జాదారులు రెచ్చిపోతూ అనుమతి లేకుండా ఇళ్లు కట్టడం, ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పురావస్తు శాఖ కేవలం నోటీసులు ఇచ్చి వదిలేస్తోంది. ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. వేయిస్తంభాల గుడిలోని కల్యాణ మండపం నిర్మాణం మొదలై 16 ఏళ్లు కావస్తున్నా పురావస్తు శాఖ అలసత్వం వల్ల నిర్మాణం పూర్తికావడం లేదు. రామప్ప ఆలయానికి ప్రపంచ హోదా వచ్చిన నేపథ్యంలోనైనా అధికారులు ప్రాచీన ఆలయాలను కాపాడేందుకు నడుం కడితే రామప్ప లాంటి మరిన్ని ఆలయాలు మన సొంతం అవుతాయి.

ఇదీ చదవండి:

ramappa temple: ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయం

ABOUT THE AUTHOR

...view details