ఎక్సైజ్ ఆదాయాన్ని ఎస్క్రో ఖాతాకు మళ్లించటం రాజ్యాంగ విరుద్ధమంటూ వెలగపూడి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై రిప్లై కౌంటర్ వేసేందుకు సమయం కావాలని పిటిషనర్ తరపు న్యాయవాది యలమంజుల బాలాజీ న్యాయస్థానాన్ని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సమయం కోరటంపై ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి రుణాలను తీసుకునేందుకు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం చట్టవిరుద్ధమని పిటిషనర్ న్యాయస్థానానికి తెలిపారు. పిటిషనర్ వాదనలపై స్పందించిన ఏజీ.. తాము కన్సాలిడేట్ ఫండ్‌కు నిధులు ఇస్తున్నామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉండటం వల్ల బ్యాంకులు రుణాలు ఆపేస్తున్నాయని.. పిటిషన్‌ను వెంటనే పరిష్కరించాలని హైకోర్టు ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈనెల 18లోగా రిజాయిండర్ వేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. అనంతరం విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.