Godavari River: గోదావరి నది మహోగ్రరూపానికి భద్రాచలం జలదిగ్బంధమైంది. ఊహించని రీతిలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రవాహం.. తీరప్రాంతాలను అల్లకల్లోలం చేస్తుంది. మునుపెన్నడూ లేనివిధంగా ప్రమాదకర స్థాయిని దాటడంతో.. భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల తీవ్ర హెచ్చరికల జారీతో ముంపు బాధితులంతా పునరావాసాలకు చేరుతుండగా.. ఇళ్ల వద్ద ఉన్న వారు బిక్కుబిక్కుమంటూ గాలం గడుపుతున్నారు.
భద్రాచలంలో గంటగంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. ప్రస్తుతం 70.9 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ఎగువ నుంచి గోదావరిలోకి 23.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహిస్తుండటంతో ఇప్పటికే లోతట్టు కాలనీవాసులను పునరావాస కాలనీలకు తరలించారు. భద్రాచలంలోని కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ, శాంతినగర్ పిస్తా కాంప్లెంక్స్ ఏరియా, సుభాష్ నగర్ ప్రాంతాల్లో దాదాపు వెయ్యి మందిని 9 పునరావాస కేంద్రాలకు చేర్చారు.
1986లో అత్యధికంగా 75.6 అడుగుల నీటిమట్టం నమోదు కాగా.. 1990లో 70.80.. 2006లో 66.90 అడుగులు నమోదైంది. ముందు జాగ్రత్తగా గోదావరి వారధిపై రాకపోకలు నిలిపివేశారు. దీంతో తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్ర ప్రాంతాలకు భద్రాచలం నుంచి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం, బూర్గంపాడు మండలాల మధ్య వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో 144 సెక్షన్ విధించారు.
రంగంలోకి ఇండియన్ ఆర్మీ..: ఈ నేపథ్యంలోనే సహాయక చర్యలు అందించేందుకు ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. 78 మందితో కూడిన ఇన్‌ఫాంట్రీ దళం, 10 మంది వైద్యులు, 23 మంది ఇంజినీర్లు సహా మొత్తం 101 మందితో కూడిన బృందం భద్రాచలం బయలుదేరింది.
భద్రాద్రి వరదలపై సీఎం సమీక్ష: భద్రాచలం వరద సహాయచర్యల వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. భద్రాచలానికి అదనపు రక్షణ సామగ్రి తరలించాలని సీఎస్‌కు తెలిపారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ అందుబాటులో ఉంచాలని సూచించారు. భద్రాచలంలోని తాజా పరిస్థితులపై కేసీఆర్ మంత్రి పువ్వాడ ద్వారా ఆరా తీశారు.
వరద సహాయక చర్యలపై మంత్రి పువ్వాడ, కలెక్టర్‌పర్యవేక్షణ: భద్రాచలం వరద గుప్పిట్లో చిక్కుకుందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు . లోతట్టు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. చాలా కాలనీలు జలమయమయ్యాయి. బాధితుల్ని పునరావాస ప్రాంతాలకు తరలించాం. 80 అడుగుల నీటిమట్టం దాటినా భారీ నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టామని తెలిపారు.
గోదావరి ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం శతవిధాలా ప్రయత్నిస్తోంది. కొన్ని కుటుంబాల వారు ఇంటిని వీడేందుకు మొండికేస్తుండడంతో కలెక్టర్ అనుదీప్ స్వయంగా రంగంలోకి దిగి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ చేపట్టారు. వరద ఉద్ధృతిని తక్కువ అంచనావేసి దయచేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని మైక్‌లో ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు.