Traffic Pending Challans: తెలంగాణలో రాయితీలపై పెండింగ్ జరిమానాల చెల్లింపు ప్రక్రియకు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. మార్చి 1 నుంచి ఈ విధానం కొనసాగుతోంది. మరో 3 రోజులు మాత్రమే ఈ తరహా జరిమానాలు చెల్లించడానికి సమయం ఉండడంతో... ఇంకా జరిమానాలు చెల్లించని వాహనదారులు వీలైనంత తొందరగా వీటిని చెల్లించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2 కోట్ల చలాన్లు చెల్లించారని.. ఇందులో రాయితీ మినహాయించి రూ.200 కోట్లకు పైనే ప్రభుత్వ ఖజానాకు వచ్చి చేరాయని సమాచారం. ప్రస్తుతం ప్రతి రోజు ఏడు నుంచి పది లక్షల చలాన్లు వాహనదారులు చెల్లిస్తున్నారు.
గడువు పెంచే యోచన లేదు:రాయితీపై పెండింగ్ చలాన్ల చెల్లింపునకు ప్రస్తుతానికి గడువు పెంచే యోచన లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గడువు పెంచాలని విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ... ఇంకా నిర్ణయం తీసుకోలేదని ట్రాఫిక్ సంయుక్త కమిషనర్ రంగనాథ్ తెలిపారు. గడువులోపు జరిమానాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వాహనదారులపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రహదారులపై నిబంధనలు పాటించకుండా ఉల్లంఘనలకు పాల్పడే వారిపై ఛార్జ్‌షీట్లు దాఖలు చేయనున్నారు.