స్వాతంత్య్ర కాంక్షను దేశమంతటా రగిలిచేందుకు బాపూజీ అనేక పర్యటనలు చేశారు. ఈ క్రమంలోనే 1920లో విజయవాడకి వచ్చిన గాంధీజీ నగరంలోని రైల్వే స్టేషన్కు పశ్చిమ భాగంలో ఉన్న ఒక కొండ కింద సమావేశాన్ని నిర్వహించారు. ఆ ప్రాంతమే నేడు గాంధీ హిల్గా పేరుగాంచింది. పాలకుల నిర్లక్ష్యంతో కొన్నేళ్లుగా నిర్వహణకు దూరంగా ఉన్న ఈ ప్రాంతం..పిచ్చి మెుక్కలు పెరిగి పర్యటకంగా వెనుకబడిపోయింది.
ఈ క్రమంలోనే గాంధీ కొండను పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు నగరపాలక సంస్థ పూనుకుంది. రూ. 2 కోట్ల నిధులు సైతం కేటాయించింది. అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని 10 శాతం పనులను హడావుడిగా పూర్తి చేసింది. గాంధీ జయంతి రోజు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఘనంగా గాంధీ హిల్ అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసి తీరుతామని నేతలు స్పష్టం చేశారు. కానీ వారి మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. అనుకున్న విధంగా పనుల్లో పురోగతి కనిపించటం లేదు.
గుత్తేదార్ల అనాసక్తి..
గాంధీహిల్ను అభివృద్ధి చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు రూ. 2 కోట్లతో టెండర్లను ఆహ్వానించారు. కాగా..టెండర్ల వేసేందుకు గుత్తేదారులెవరూ ముందుకు రావటం లేదు. టెండర్లు దక్కించుకోవాలని గుత్తేదారులకు ఉన్నా.. అంత పెద్ద మెుత్తంతో పనులు చేశాక నిధులు వస్తాయో లేదో అన్న అనుమానంతో వారు వెనకడుగు వేస్తున్నారు. దీంతో నగరపాలక సంస్థ అధికారులు వెనక్కి తగ్గారు. రూ.2 కోట్లతో కాకుండా పనులను విభజించి తక్కువ కోట్కు టెండర్లు పిలవాలని ఆలోచిస్తున్నారు. మెుదట రూ. 20 లక్షలకు టెండర్లు పిలిచేందుకు ఇంజనీరింగ్ అధికారులు సమాయత్తమవుతున్నారు.