తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కొత్తపల్లిలో ఇంటి గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన మోష, శాంతమ్మ దంపతులు తమ ఐదుగురు సంతానంతో కలిసి ఓ గుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు. రోజూలాగే శనివారం రాత్రి ఇంటిలో నిద్రించారు. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు ఇంటి గోడలు తడిసి పోయాయి. ఈ క్రమంలో ఇంట్లో గదులను వేరు చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గోడ అర్ధరాత్రి వారిపై ఒక్కసారిగా కుప్పుకూలింది. ఈ ఘటనలో కుటుంబ యజమాని మోష, అతని భార్య శాంతమ్మ, పిల్లలు చరణ్, తేజ, రాము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు పిల్లలు స్నేహ, చిన్న ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలైన వారిని అంబులెన్స్‌లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం..
కొత్తపల్లి ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి ఫోన్ చేసి ఘటనా వివరాలు ఆరా తీశారు. మృతులకు ఒక్కొక్కరికి 5లక్షల పరిహారాన్ని ప్రకటించాల్సిందిగా మంత్రి నిరంజన్ రెడ్డిని ఆదేశించారు. గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించి వాటిల్లో నివాసముంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. విద్య, వైద్యపరంగా సాయం అందిస్తామన్నారు. సమాచారం అందుకున్న అలంపూర్ శాసనసభ్యుడు అబ్రహాం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాన్ని ఆదుకునేలా స్పష్టమైన హామీ ఇవ్వాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. అంతవరకూ పంచనామా చేయనివ్వబోమని అడ్డుకున్నారు. రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రితో మాట్లాడానని, 25లక్షల పరిహారంతో పాటు.. ఇల్లు, పిల్లల చదువుల బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని అబ్రహాం హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ క్రాంతి కూడా ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.