ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వీలు కాదంటున్న ప్రభుత్వం.. జరిపి తీరాలంటున్న విపక్షం - పంచాయితీ ఎన్నికలు

గ్రామ పంచాయతీల ఎన్నికలకు ఎస్​ఈసీ‌ షెడ్యూలు ప్రకటనతో రాష్ట్రంలో ఎన్నికల పంచాయితీ ఒక్కసారిగా వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాలు తీవ్ర వ్యాఖ్యలతో ఎదురుదాడి చేసుకున్నాయి. కాంగ్రెస్‌ మినహా ప్రతిపక్షాలన్నీ ఎస్‌ఈసీ ప్రకటనను స్వాగతించాయి. అవసరమైతే సుప్రీంకోర్టునైనా ఆశ్రయిస్తామని.. పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని అధికారపక్ష నేతలు, మంత్రులు స్పష్టం చేశారు.

ap Panchayat raj elections
ఎన్నికలు జరపలేమంటూ హైకోర్టుకెక్కిన రాష్ట్ర ప్రభుత్వం

By

Published : Jan 10, 2021, 5:25 AM IST

Updated : Jan 10, 2021, 6:47 AM IST

రాష్ట్రంలో ఎన్నికల పంచాయితీ ఒక్కసారిగా వేడెక్కింది. గ్రామ పంచాయతీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ షెడ్యూలు ప్రకటించడం వల్ల అధికార, ప్రతిపక్షాలు తీవ్ర వ్యాఖ్యలతో ఎదురుదాడి చేసుకున్నాయి. ప్రభుత్వం హైకోర్టు మెట్లు ఎక్కింది. కరోనా నేపథ్యం, ప్రజారోగ్య రక్షణ, ఉద్యోగుల ఆరోగ్యం.. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నికల విషయంలో ముందుకెళ్లకుండా ఎస్‌ఈసీని నిలువరించేలా ఆదేశించాలంటూ శనివారం వ్యాజ్యం దాఖలు చేసింది. సోమవారం విచారణ జరపనుంది.

స్వాగతించిన ప్రతిపక్షాలు..

కాంగ్రెస్‌ మినహా ప్రతిపక్షాలన్నీ ఎస్‌ఈసీ ప్రకటనను స్వాగతించాయి. ప్రభుత్వ వైఖరిని దునుమాడాయి. కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్న వైకాపా ప్రభుత్వం.. ఇప్పుడు కేసులు తగ్గి అన్ని చోట్లా ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడ వద్దంటోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడు, కళా వెంకటరావు, కేఎస్‌ జవహర్‌ లాంటి పలువురు మాజీ మంత్రులూ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ఎస్‌ఈసీది ఏకపక్ష నిర్ణయమని విమర్శించారు. భాజపా, సీపీఐ నేతలు ఎన్నికలకు సిద్ధమని ప్రకటించగా.. సీపీఎం మాత్రం ప్రభుత్వం, ఎస్‌ఈసీ సమన్వయంతో వ్యవహరించాలనే చెప్పింది.

ఎన్నికలను బహిష్కరిస్తాం..

అవసరమైతే సుప్రీంకోర్టునైనా ఆశ్రయిస్తామని.. పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని అధికారపక్ష నేతలు, మంత్రులు స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా తమకు 95 శాతం స్థానాలు వస్తాయి గానీ.. ఎన్నికలకు అనుకూల పరిస్థితులు రాష్ట్రంలో లేవన్నారు. ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, విశ్వరూప్‌, అప్పలరాజు, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు ఈ అంశంపై స్పందించారు.

విధుల్లో పాల్గొనలేం..

మరోవైపు ఎన్నికల విధుల్లో తాము పాల్గొనలేమంటూ ఉద్యగ సంఘాల నేతలు తేల్చిచెప్పారు. కరోనాకు తమ ప్రాణాలు బలిపెట్టలేమన్నారు. ఎన్నికల షెడ్యూలు, ప్రొసీడింగ్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. ఎస్‌ఈసీ మొండిగా వ్యవహరిస్తే ఎన్నికలు బహిష్కరిస్తామని, కోర్టునూ ఆశ్రయిస్తామని తెలిపారు. ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.చంద్రశేఖరరెడ్డి, ఏపీ గవర్న్‌మెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, పోలీసు, డిప్యూటీ కలెక్టర్ల, రెవెన్యూ సంఘాల ప్రతినిధులు ముక్తకంఠంతో ఇదే మాట చెప్పారు.

తక్షణమే విధుల నుంచి తప్పించాలి..

మరోవైపు.. గతంలో తాను బదిలీ చేయాలని చెప్పిన అధికారులను తక్షణం విధుల నుంచి తప్పించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ లేఖ రాశారు.

ఇదీ చూడండి:

ఎన్నికల కోడ్​ను సక్రమంగా పాటించేలా చూడాలి: ఎస్​ఈసీ

Last Updated : Jan 10, 2021, 6:47 AM IST

ABOUT THE AUTHOR

...view details