కృష్ణా జిల్లా గూడవల్లి డీజేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఈనాడు - ఈతరం క్లబ్ ఆధ్వర్యంలో ఈనాడు స్పోర్ట్స్ జూనియర్ కళాశాలల జిల్లా స్థాయి ఆటలు పోటీలు ముగిశాయి. కబడ్డీ , ఖోఖో, వాలీబాల్ ఫైనల్ మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగాయి. ఖోఖో బాలుర విభాగంలో వీఎస్ఎం జూనియర్ కళాశాల గుడివాడ జట్టు ప్రథమస్థానంలో నిలిచింది. 100 మీటర్ల పరుగు పందెం విభాగంలో పీబీ సిద్దార్థ కళాశాల క్రీడాకారుడు వీకే విశాల్ మొదటి స్థానం, ఎన్ఆర్ఐ కళాశాలకు చెందిన హనీష్ రెండోస్థానంలో ఉండగా.. ఉమేష్ దుర్గా రామ్ మూడో స్థానంలో నిలిచారు.
బాలికల రన్నింగ్ విభాగంలో వీఆర్ జూనియర్ కళాశాలకు చెందిన రమ్య మొదటి స్థానం, ఎస్వీఆర్ కళాశాలకు చెందిన తేజస్విని రెండోస్థానంలో నిలిచారు. విజేతలకు జిల్లా క్రీడా శాఖ సీఈవో ఝాన్సీ లక్ష్మి, శ్రీ మేధా విద్యా సంస్థల డైరెక్టర్ అన్నా నందకిషోర్, బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు జేవీఎస్ విద్యాధర్, ఈనాడు విజయవాడ యూనిట్ మేనేజర్ జీఆర్సి శేఖర్ బహుమతులు అందజేశారు.