తెదేపా, వైకాపా నేతల మధ్య మాటల యుద్ధం విజయవాడలో ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు పార్టీల నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లకు విజయవాడ గ్రామీణ మండల పరిధిలోని గొల్లపూడి వేదికైంది. ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూర్చుంటానని ప్రకటించిన తెదేపానేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అక్కడికి రావడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసి తరలించారు. అనంతరం వైకాపా నాయకులు, కార్యకర్తలు రావడంతో ఎటువంటి ఘటనలు జరగకుండా వారిని పోలీసులు చెదరగొట్టారు. పెద్దఎత్తున మోహరించిన పోలీసులు, నాయకుల రాకపోకలతో ఓ దశలో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. దీనిపై తెదేపా నేతలు భగ్గుమన్నారు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. విడుదలైన తర్వాత రాత్రికి గొల్లపూడి వచ్చిన దేవినేని ఉమా ఎన్టీఆర్ విగ్రహాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసి పాలాభిషేకం నిర్వహించారు. గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూర్చుంటానని, ఎవరు వస్తారో రావాలని దేవినేని సవాల్ విసరడంతో ఆయన నివాసం వద్ద మంగళవారం ఉదయానికే పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ఆయనను గృహ నిర్బంధం చేయాలన్నది వారి వ్యూహం. ఇది ముందుగానే పసిగట్టిన దేవినేని సోమవారం రాత్రి మరొకరి ఇంటిలో బస చేశారు. ప్రకటించిన విధంగానే మంగళవారం ఉదయం ఆయన ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రత్యక్షమయ్యారు. పోలీసులెవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్, తలకు టోపీ ధరించి నడుచుకుంటూ వచ్చారు. విగ్రహం వద్ద మెట్లు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తుపట్టిన పోలీసులు ఆయనను అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల వ్యానును అడ్డుకున్నారు. అతికష్టంపై దేవినేనిని వ్యాన్‌లోకి ఎక్కించి ఇబ్రహీంపట్నం వైపు తీసుకెళ్లారు.
ఇబ్రహీంపట్నం, పమిడిముక్కల స్టేషన్ల వద్ద ఉద్రిక్తత
దేవినేనిని గొల్లపూడి నుంచి గుంటుపల్లి వర్క్‌షాపు, ఈలప్రోలు, కొండపల్లి మీదుగా ఇబ్రహీంపట్నం స్టేషన్‌కు తరలించారు. ఈలప్రోలు వద్ద మహిళలు పోలీసుల వాహనాన్ని అడ్డగించడానికి యత్నించారు. వారిని తప్పించుకొని ఆ వాహనం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికే అక్కడ గుమిగూడిన నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆందోళనకు దిగారు. తమ నాయకుడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెదేపా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నెట్టెం రఘురాం స్టేషన్ వద్దకు చేరుకొని దేవినేనితో మాట్లాడేందుకు అనుమతించాలని కోరగా పోలీసులు అంగీకరించలేదు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేసి స్టేషన్ మెయిన్‌గేటు వరకూ వెళ్లారు. తమను లోపలికి వెళ్లనివ్వాలని కోరిన న్యాయవాది విజయలక్ష్మిని కూడా పోలీసులు తోసేయడంతో ఆమె కిందపడ్డారు. ఈ ఉద్రిక్తతల నడుమ వారందరి దృష్టిని మరల్చి ఏసీపీ రమణమూర్తి ఆధ్వర్యంలో దేవినేనిని పమిడిముక్కల పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ సమాచారం అందుకొన్న తెదేపా నాయకులు బోడె ప్రసాద్, తంగిరాల సౌమ్య, కొనకళ్ల నారాయణరావు, ఆచంట సునీత, కేశినేని శ్వేత, నెట్టెం రఘురాం, శ్రీరాం తాతయ్య, బచ్చుల అర్జునుడు, కొల్లు రవీంద్ర, రావి వెంకటేశ్వరరావు, వీరంకి గురుమూర్తి, తదితర నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బైఠాయించి నిరసన తెలిపారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో దేవినేనిని విడిచిపెట్టారు.