Chennupati Gandhi: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీని చేతులతో కొట్టడంవల్లే కంటికి గాయమైందట! ఇనుపచువ్వతో పొడిచినట్లు ఆధారాలే లేవట. ఒకరికొకరు ఎదురుపడిన సందర్భంలో వాగ్వాదం చోటుచేసుకుని క్షణికావేశంలో చేతులతో కొట్టుకునే క్రమంలో ఆయన కంటికి గాయమైందట. ఇప్పటివరకూ చేపట్టిన దర్యాప్తులో ఇదే తేలిందట! విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా విలేకరులతో చెప్పిన మాటలివి. బాధితుడి కంటి నుంచి రక్తం ధారకట్టి.. ఆయన ధరించిన తెల్లచొక్కాపై రక్తపు మరకలున్నా.. అవి చేత్తో కొట్టిన గాయం వల్లేనని సీపీ అంటున్నారు! దాడికి పాల్పడినవారు వైకాపా నాయకులు కావడంతో ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో వారిని తప్పించేందుకు ఇలా చేస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి.
అప్పటికప్పుడు పదునైన ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయి?
శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన జరగ్గా.. ఆదివారం మధ్యాహ్నం వరకూ కేసే నమోదు కాలేదు. తెదేపా నాయకులు ఏసీపీ కార్యాలయానికి వెళ్లి గట్టిగా ప్రశ్నిస్తే తప్ప కేసు పెట్టలేదు. వైకాపా నాయకులు మారణాయుధాలతో దాడి చేసి తనను అంతమొందించేందుకు యత్నించారని గాంధీ ఫిర్యాదు చేసినా.. అసలు హత్యాయత్నం (ఐపీసీ 307) సెక్షనే పెట్టలేదు. ప్రమాదకరమైన ఆయుధంతో దాడి (ఐపీసీ 326), నేరపూరిత బెదిరింపు (ఐపీసీ 506) సెక్షన్లకే పరిమితమయ్యారు. హత్యాయత్నం సెక్షను ఎందుకు జోడించలేదని విలేకరులు సీపీని ప్రశ్నించగా.. ‘పిడికిలితో కొట్టడంవల్ల కంటికి గాయమైంది. ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులూ ఇదే విషయం చెప్పారు. గాంధీ శరీరంపై పదునైన ఆయుధంతో గాయాలేమీ లేవు. హత్య చేయడానికి నిందితులకు ఒక ఉద్దేశం.. ప్రణాళిక ఉన్నప్పుడే హత్యాయత్నం సెక్షన్ పెడతారు’ అని సమాధానమిచ్చారు. ఉద్దేశం, ప్రణాళిక లేకపోతే అప్పటికప్పుడు పదునైన ఆయుధాలు ఎలా వచ్చాయనే ప్రశ్నకు పోలీసుల నుంచి సమాధానం లేదు.
కళ్ల ముందే గాయం కనిపిస్తుంటే.. కేసు పెట్టడానికి న్యాయసలహా అట
వైకాపా నాయకులు తనపై హత్యాయత్నం చేశారని, ఆ దాడిలో గాయపడ్డానని ఘటన జరిగిన వెంటనే పోలీసులకు గాంధీ ఫిర్యాదు చేశారు. అందుకు తార్కాణంగా ఆయన కంటిపై గాయమూ ఉంది. ప్రత్యక్ష సాక్షులూ దాడి జరిగిందని చెబుతున్నారు. కానీ పోలీసులకు అవేవీ పట్టలేదు. న్యాయసలహా, వైద్యుల నివేదిక పేరిట కేసు నమోదులో జాప్యం చేశారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాతా దానిని బయటకు రానివ్వలేదు. సీపీ ప్రెస్‌మీట్‌లోనూ నిందితుల పేర్లు చెప్పలేదు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు ప్రత్యక్షంగా పాల్గొన్నారనే చెప్పారు. తనపై ముగ్గురు వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారని వారి పేర్లతో సహా గాంధీ ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నా... ఇద్దరినే నిందితులుగా చేర్చారు. గాంధీపై దాడి చేయించిన తొమ్మిదో డివిజన్ వైకాపా ఇన్‌ఛార్జి వల్లూరి ఈశ్వర్‌ప్రసాద్‌ను కేసు నుంచి తప్పించారని, అందుకే నిందితుల పేర్లు వెల్లడించట్లేదని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.
మద్యం తాగుతూ రెక్కీ?
గాంధీపై పథకం ప్రకారమే హత్యాయత్నం జరిగిందని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. కృష్ణలంక నుంచి కొందరిని వైకాపా నాయకులు తెప్పించారని చెబుతున్నారు. వీరు పది రోజులుగా గాంధీ ఇంటికి సమీపంలో ఉన్న ఆశ్రమం గ్రౌండ్‌లో మద్యం తాగుతూ రెక్కీ నిర్వహించారంటున్నారు. దాడి రోజూ వారు అక్కడే మద్యం తాగి, గాంధీ కదలికల సమాచారం చేరవేసినట్లు స్థానికులు, తెదేపా నాయకులు చెబుతున్నారు.
ప్రత్యక్ష సాక్షుల్ని విచారిస్తున్నాం: కాంతి రాణా టాటా, పోలీసు కమిషనర్
‘ఒకరికొకరు ఎదురుపడి క్షణికావేశంలో చేతులతో కొట్టుకునే క్రమంలో గాంధీ కంటికి గాయమైంది. ఐపీసీ 326, 506 రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాం. ప్రత్యక్ష సాక్షుల్ని విచారిస్తున్నాం. సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నాం. ఇనుపచువ్వతో కంట్లో పొడిచినట్లు, రాడ్డుతో కొట్టినట్లు ఆధారాలు లేవు. కొందర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం. పిడికిలితో కొట్టటం వల్లే కంటికి గాయమైందని ఎల్‌వీ ప్రసాద్ వైద్యులు నివేదిక ఇచ్చారు. త్వరలో ప్రభుత్వ వైద్యుల్ని హైదరాబాద్‌కు పంపించి వారి నుంచి నివేదిక తెప్పించుకుంటాం. ఘటనా స్థలంలో ఏడుగురు ఉన్నట్లు తేలింది.’