రాష్ట్రంలోని వైకాపా, తెదేపా.. కేంద్రంలో భాజపాకు ఏ,బీ గ్రూప్ పార్టీలుగా వ్యవహరిస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాధ్ ఆరోపించారు. భాజపా, ఆర్ఎస్ఎస్లు భారతదేశ రైతాంగాన్ని పరాధీనులుగా మార్చే కుట్రలు చేస్తున్నాయని.. వాటికి ఈ రెండు పార్టీలు మద్దతిస్తున్నాయన్నారు.
పంపు సెట్లకు విద్యుత్ మీటర్లను అమర్చడం, కార్పొరేట్లకు లబ్ది చేకూర్చేలా సంస్కరణల పేరుతో వ్యవసాయ బిల్లులను తీసుకురావడం ఈ కుట్రలో భాగమే అని ఘాటు విమర్శలు చేశారు. వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నా.. మూజువాణి ఓటుతో ఆమోదించుకున్నారని విమర్శించారు. బిల్లులకు వ్యతిరేకంగా నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టామన్నారు. రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని.. వారి ప్రయోజనాల కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.