విజయవాడలో కృష్ణానదీ తీరంలో 9 దేవాలయాల పునర్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ భూమిపూజ చేశారు. శనీశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేపట్టనున్న ప్రాంతంలో ముహూర్తం ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. పురోహితులు ప్రత్యేక పూజలు చేయగా.. శాస్త్రోక్తంగా సీఎం జగన్ ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు. సీఎంతో పాటు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు, బొత్స సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రకాశం బ్యారేజీ దిగువన పై వంతెన ఆనుకున్న ఉన్న ప్రాంతంలో ఆలయాలు నిర్మిస్తున్నారు. రాహు – కేతు ఆలయం, శ్రీ సీతమ్మ పాదాలు, దక్షిణముఖ ఆంజనేయస్వామి ఆలయం, శ్రీ శనీశ్వర ఆలయం పునర్ నిర్మాణం, బొడ్డు బొమ్మ, ఆంజనేయస్వామి ఆలయం, శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయం, వీరబాబు ఆలయం, కనకదుర్గ నగర్‌లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల లను పునర్నిర్మించనున్నారు. ఆలయాల నిర్మాణం దేవాదాయ శాఖ చేపట్టనుండగా.. సుందరీకరణ పనులను పురపాలక శాఖ చేపట్టనుంది.
వీటితో పాటు రూ. 77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. శిలా పలకాన్ని ఆవిష్కరించారు. దుర్గ గుడి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 70 కోట్లు నిధులు ఇస్తుండగా.. దేవ స్థానం రూ. 7కోట్లు వెచ్చిస్తోంది. భక్తుల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.