ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జగనన్న తోడు' ప్రారంభం.. చిరు వ్యాపారుల ఖాతాల్లోకి రూ. 905 కోట్లు - జగనన్న తోడు పథకం తాజా వార్తలు

చిరు వ్యాపారులు సమాజానికి చేస్తున్న సేవ మహనీయమైనదని సీఎం జగన్ కొనియాడారు. గతంలో వారికి రుణాలు అందేవి కాదన్నారు. తమ ప్రభుత్వంలో ఒక్కొక్కరికి రూ.10 వేల రుణం ఇస్తామని చెప్పారు. జగనన్న తోడు పథకం ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విషయాలు వెల్లడించారు.

CM Jagan launch jagananna thodu scheeme
CM Jagan launch jagananna thodu scheeme

By

Published : Nov 25, 2020, 12:48 PM IST

Updated : Nov 25, 2020, 5:46 PM IST

చిరు వ్యాపారులకు చేయూత అందించేందుకు 'జగనన్న తోడు' పేరిట సరికొత్త పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. వడ్డీ వ్యాపారుల నుంచి చిరు వ్యాపారులకు విముక్తి కల్పించడమే లక్ష్యంగా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చిరు వ్యాపారులు, హస్తకళాకారులు, చేతి వృత్తుల వారికీ ఏటా 10 వేల చొప్పున వడ్డీ లేని రుణాలు అందించనున్నట్లు తెలిపారు. పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు.

నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతి వృత్తుల వారికి ఆర్థిక సాయం అందించేందుకు జగనన్న తోడు పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్నీ, పలు బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కంప్యూటర్ బటన్ నొక్కిన సీఎం జగన్.. లబ్ధిదారుల ఖాతాలో నగదనును జమ చేశారు. 9.05 లక్షల మంది లబ్ధిదారులకు 905 కోట్ల రూపాయలను సీఎం ఇవాళ జమ చేశారు. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులను అందించారు.

పాదయాత్రలో వారి కష్టాలు చూశా

అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లు, లబ్ధిదారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు, లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడిన సీఎం.. జగనన్న తోడు పథకం ప్రారంభించేందుకు కారణాలను, పథకం వర్తింప జేసే విధానం తెలియజేశారు. పాదయాత్రలో చిరు వ్యాపారులు పడుతున్న కష్టాలను తెలుసుకున్నాని వారి ఆర్థిక కష్టాలు తీర్చేందుకు పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు. చిరువ్యాపారులు ఆత్మగౌరవంతో అమూల్యమైన సేవలందిస్తోన్న మహనీయులని సీఎం కొనియాడారు.

వారు లేకుంటే ఆర్థికవ్యవస్థ నడవదు

చిరువ్యాపారులు లేకపోతే వారి బతుకుబండే కాకుండా ఆర్థిక వ్యవస్థ కూడా నడవదని సీఎం జగన్ అన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న వారికి గతంలో ఏ బ్యాంకులూ రుణాలు ఇచ్చే పరిస్థితి ఉందని..పెట్టుబడి కావాలంటే ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అధికవడ్డీలకు రుణం తీసుకునేవారన్నారు. 3 నుంచి 10 రూపాయల వడ్డీతో రుణం తీసుకుని వ్యాపారాలు చేసే పరిస్థితి చిరువ్యాపారులదన్నారు. దీని వల్ల వచ్చిన లాభం వడ్డీలకే చెల్లించే పరిస్థితి ఉండేదన్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకులతో ప్రభుత్వం చర్చలు జరిపి రుణాలు ఇచ్చేలా ఒప్పించిందన్నారు.

చిరు వ్యాపారుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చి అండగా నిలబడి చేయూత ఇవ్వాలని అనుకుని పథకాన్ని ప్రారంభించాం. 10 లక్షల మంది చిరు వ్యాపారులు, సాంప్రదాయ హస్తకళలకు 10 వేల చొప్పున బ్యాంకుల నుంచి రుణం ఇవ్వనున్నాం. లబ్ధిదారులకు బ్యాంకులు స్మార్ట్ కార్డులు జారీ చేస్తాం. కట్టిన వడ్డీ మొత్తాన్ని మూడు నెలలకోసారి లబ్ధిదారుల ఖాతాలకే ప్రభుత్వం జమ చేస్తుంది. ఏడాదికి 60 నుంచి 100 కోట్ల వరకు వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.

- సీఎం జగన్

రెండు నెలల్లో రుణాలు

పథకానికి ఎంపిక కాకపోతే ఎవరూ ఆందోళన చెందాల్సి అవసరం లేదని.. సీఎం అన్నారు. అర్హులైన వారు గ్రామ సచివాలయాల్లో నెలలోపు దరఖాస్తు చేయాలన్నారు. రెండు నెలల్లో అర్హులైన వారందరికీ రుణాలు ఇస్తామని జగన్ తెలిపారు. అర్హత ఉండి జాబితాలో పేరు లేని వారు.. 1902 కాల్​ సెంటర్​కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చన్నారు. లబ్ధిదారులు బ్యాంకులకు సకాలంలో రుణాలు చెల్లించాలని సీఎం సూచించారు. రుణం తీరాక తిరిగి లబ్ధిదారులకు వడ్డీలేని రుణం తీసుకునేందుకు అర్హత కల్పించనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

కారు-జీపు ఢీ.. నలుగురు దుర్మరణం

Last Updated : Nov 25, 2020, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details