ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి నుంచే కర్ఫ్యూ అమలు.. వాటికి మాత్రమే మినహాయింపు

ఇవాళ్టి నుంచే కర్ఫ్యూ అమలు.. మినహాయింపు వీటికే..
ఇవాళ్టి నుంచే కర్ఫ్యూ అమలు.. మినహాయింపు వీటికే..

By

Published : May 4, 2021, 10:54 PM IST

Updated : May 5, 2021, 5:46 AM IST

19:06 May 04

రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రెండు వారాలపాటు, ప్రతిరోజూ 18 గంటల చొప్పున కర్ఫ్యూను అమలులోకి తెస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం నుంచి ఈనెల 18 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144వ సెక్షన్‌ విధిస్తారు. ఆ సమయంలో ఎక్కడా ఐదుగురికి మించి గుమిగూడి ఉండటానికి వీల్లేదు. వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు వంటి వాటిని మూసివేయాలి. ఆస్పత్రులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్‌లు, ఔషధ దుకాణాలతోపాటు కొన్ని అత్యవసర సేవలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. కర్ఫ్యూ నిబంధనలు, అనుసరించాల్సిన విధివిధానాలపై వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పటికే ముహుర్తాలు నిర్ణయించుకుని, వాటిని వాయిదా వేసుకోలేని పరిస్థితుల్లో నిర్వహించే వివాహాది వేడుకలకు 20 మందికి మించి హాజరవడానికి లేదని స్పష్టంచేశారు. అది కూడా స్థానిక అధికారుల నుంచి ముందస్తు అనుమతితో, కొవిడ్‌ నిబంధనల్ని పాటిస్తూ నిర్వహించుకోవాలి. ప్రభుత్వం మినహాయింపునిచ్చిన అత్యవసర విభాగాలు, సేవల రంగాల్లో పనిచేస్తున్నవారు తప్ప... మిగతా వ్యక్తులెవరు కర్ఫ్యూ సమయంలో బయట తిరగడానికి వీల్లేదు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ సహా, వ్యవసాయ రంగానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ... వ్యవసాయశాఖ జారీ చేసే కొవిడ్‌ మార్గదర్శకాలను అనుసరించి నిర్వహించుకునేందుకు అనుమతిచ్చారు. తయారీ రంగానికి చెందిన పరిశ్రమలకూ మినహాయింపునిచ్చారు.

  • కర్ఫ్యూని తక్షణం అమలు చేసేందుకు వీలుగా... అన్ని ప్రభుత్వ విభాగాలు, పోలీసు కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు ఆదేశాలు, నోటిఫికేషన్లు ఇవ్వాలంది. మినహాయింపునిచ్చిన కేటగిరీలకు చెందిన వారికి పాస్‌లను జారీ చేయాలంది. నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టంలోని 51, 60 సెక్షన్లు, ఐపీసీ సెక్షన్‌ 188తోపాటు దీనికి వర్తించే ఇతర చట్టాల్ని అనుసరించి ప్రాసిక్యూట్‌ చేస్తామని హెచ్చరించింది.
  •  కర్ఫ్యూలేని సమయంలో 144 సెక్షన్‌ని పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది. సరకుల కొనుగోలుకి, వివిధ సేవలు పొందేందుకు భౌతికదూరం, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ క్యూల్లో నిలబడ్డ వారికి అది వర్తించదు.
  •  

బయట తిరిగేందుకు అనుమతి ఉన్నవారు
 

  • ప్రభుత్వం అత్యవసర సేవలుగా గుర్తించి, కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చిన రంగాలకు చెందినవారు.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, హైకోర్టు, ఇతర కోర్టుల అధికారులు, సిబ్బంది, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్‌ సంస్థలకు చెందిన అత్యవసర సేవలందించే సిబ్బంది. వీరంతా గుర్తింపు కార్డుతోపాటు ప్రభుత్వం జారీ చేసే డ్యూటీ పాస్‌ కలిగి ఉండాలి.
  •  ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు, నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బంది, ఆస్పత్రికి సంబంధించిన ఇతర సేవల్లో నిమగ్నమయ్యే సిబ్బంది. వారు గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.
  • వైద్య సేవల కోసం వెళ్లే గర్భిణిలు, రోగులు.
  • ప్రభుత్వం ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి వెళ్లేవారు.
  • ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య సంస్థల్లో వైద్య సేవలు పొందుతున్నవారు.
  • ఆరోగ్య సేవలు పొందేందుకు ప్రైవేటు వాహనాల్లో వెళ్లేందుకు.
  • విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండ్లకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులు. వారు టిక్కెట్‌ చూపించాల్సి ఉంటుంది. ప్రయాణికులను విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్‌ల నుంచి వారి గమ్యస్థానానికి చేర్చేందుకు స్థానిక అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలి.

కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చిన మరికొన్ని రంగాలివీ..!

  • ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా.
  • టెలికమ్యూనికేషన్లు, ఇంటర్నెట్‌ సర్వీస్‌లు, బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీసులు, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు.
  • పెట్రోల్‌ పంపులు, ఎల్‌పీజీ, సీఎన్‌జీ, పెట్రోలియం, గ్యాస్‌ అవుట్‌లెట్లు.
  • విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ.
  • నీటి సరఫరా, పారిశుద్ధ్యం.
  • శీతల గిడ్డంగులు, వేర్‌హౌసింగ్‌ సేవలు.
  • ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు.
  • తయారీ పరిశ్రమలు.
  • వ్యవసాయరంగం.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 20,034 కరోనా కేసులు, 82 మరణాలు

Last Updated : May 5, 2021, 5:46 AM IST

ABOUT THE AUTHOR

...view details