అమరావతిపై గతంలో అబద్దాలాడి అభాసుపాలైన మంత్రి బొత్స ఇప్పుడు అచ్చెన్నాయుడిపై కూడా అదేవిధంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. అబద్ధాల శాఖకు మంత్రిగా బొత్స వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సిఫారసు లేఖ ఇచ్చిన దానికే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే... వోక్స్ వేగన్కి రూ.10 కోట్లు కట్టబెట్టిన బొత్సని ఎందుకు అరెస్ట్ చేయకూడదని నిలదీశారు.
బీసీలకు రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి జగన్మోహన్ రెడ్డి తగ్గిస్తే కనీసం నోరుమెదపడానికి భయపడిన బొత్సకు మాట్లాడే అర్హత లేదన్నారు. కాంగ్రెస్లో మంత్రిగా ఉన్న సమయంలో జగన్ను తిట్టిన బొత్స... నేడు అదే జగన్ వద్ద ప్రాపకం కోసం తెదేపాపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.