విజయవాడ కరెన్సీనగర్‌లో ఉంటున్న మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రల ఇంటికి వెళ్లి తెలుగుదేశం అధినేత చంద్రబాబు వారిని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రజా జీవితంలో పోరాటానికి దిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. అచ్చెన్న చాలా ధైర్యవంతుడన్న చంద్రబాబు... అతన్ని ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఏం చేయలేవంటూ ధీమా వ్యక్తం చేశారు. తాను, పార్టీ పూర్తి అండగా ఉంటుందన్న చంద్రబాబు.. మున్ముందు ఇదే ధైర్యాన్ని కనబరచాలని అచ్చెన్నకు సూచించారు. అక్రమ కేసులకు భయపడి తలొగ్గే సమస్యే లేదని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు చంద్రబాబుకు తేల్చిచెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మున్ముందు పోరాటాన్ని మరింత పెంచుతాని స్పష్టం చేశారు.
నిలదీస్తూనే ఉంటాను: అచ్చెన్నాయుడు
ప్రభుత్వం తప్పులు నిలదీయడమే తాను చేసిన తప్పయితే ,ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా నిలదీస్తూనే ఉంటానని అచ్చెన్నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. సర్కారు అవినీతిని ప్రశ్నించడమే నేరమైతే ఎన్ని అక్రమకేసులు పెట్టినా తాను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. నిజాయితీయే తన ధైర్యం, సత్యం ఆయుధమన్న అచ్చెన్నా.., ప్రజాక్షేమమే తన లక్ష్యమన్నారు.