'ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు' పేరిట తెలుగుదేశం అధినేత చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష(Chandrababu’ 36-hour protest against attacks) చేపడుతున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అల్లరిమూక విధ్వంసం సృష్టించిన ప్రదేశంలోనే... కాసేపట్లో దీక్షకు కూర్చోనున్నారు. ఈ దీక్షలో కొవిడ్ నిబంధనలు పాటించాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దుండగుల దాడి, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్ల వద్ద వైకాపా కార్యకర్తల దాడి యత్నాలకు నిరసనగా... తెలుగుదేశం అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష(Chandrababu’ 36-hour protest against attacks) చేపడుతున్నారు. ఈ ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు నిరసన దీక్ష కొనసాగిస్తారు. ఇందులో సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం(chandrababu on ‘State sponsored terrorism’)పై చేస్తున్న ఈ పోరాటానికి సంఘీభావంగా... ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, పౌర సంఘాలు కలసి రావాలని తెలుగుదేశం నేతలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఫ్యాక్షనిజానికి అధికారం తోడైందని, ఈ అరాచకంలో పోలీసులు అంతర్భాగమయ్యారని మండిపడ్డారు. వీరి చర్యలతో ప్రజాస్వామ్యం నశించిందని, ప్రశ్నించిన వారిని భౌతికంగా అంతమొందించే ఉన్మాద, మూక దాడులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెర తీశారని నేతలు ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయంపై మూకదాడి చేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదని... ఇది కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమేనన్నారు.
ముఖ్యమంత్రి, డీజీపీ ప్రోద్బలంతోనే విధ్వంసం
కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు కుట్రతో పార్టీ కార్యాలయాలు, తెదేపా నేతల ఇళ్లపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కుటుంబ సభ్యులు ప్రాణభయంతో వణికిపోయేలా దాడులకు తెగబడ్డారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి, డీజీపీ ప్రోద్బలంతోనే విధ్వంసం జరిగిందని నేతలు ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం చేస్తున్న పోరాటాన్ని జీర్ణించుకోలేని వైకాపా ప్రభుత్వం దమనకాండ కొనసాగిస్తోందని, దాన్ని నిలువరించాల్సిన బాధ్యత రాష్ట్రంలోని ప్రతి పౌరుడిపై ఉందని నేతలు పేర్కొన్నారు.