CBN LETTER TO CM JAGAN : అనంతపురం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌ను సర్వీస్ నుంచి తొలగించడంపై న్యాయవిచారణ జరిపించాలని సీఎం జగన్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తనను అక్రమంగా డిస్మిస్ చేశారన్న కానిస్టేబుల్ ప్రకాశ్ ఫిర్యాదుపైనా సీబీఐతో విచారణ జరిపించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. దళిత ఉద్యోగిని అక్రమ కేసులో ఇరికించారని చంద్రబాబు మండిపడ్డారు. దళిత, బడుగు వర్గాల వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ఘటనలు ప్రతి రోజూ వెలుగు చూస్తుండడం బాధాకరమని లేఖలో పేర్కొన్నారు. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదులో నిందితులుగా ఉన్న ముగ్గురు అధికారులు ప్రస్తుతం అదే జిల్లాలో కీలకమైన స్థానాల్లో ఉన్నందున విచారణను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్నారు.
విచారణ పూర్తయ్యే వరకు ఆ ముగ్గురు అధికారులను వీఆర్‌లో ఉంచాలని చంద్రబాబు సూచించారు. ఐపీఎస్ స్థాయి అధికారులు ముద్దాయిలుగా ఉన్న ఈ కేసులో నిష్పాక్షికమైన దర్యాప్తు జరగాల్సి ఉందని స్పష్టం చేశారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిల విడుదల కోరినందుకు ప్రకాశ్‌ను.. సంబంధం లేని కేసులో ఇరికించి సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారని చంద్రబాబు మండిపడ్డారు.