Chandrababu Kuppam Tour: ప్రజాసమస్యలు నేరుగా తెలుసుకునేందుకే కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తాను కుప్పం వదిలిపెడతానని దుష్ప్రచారం చేస్తున్నారన్న బాబు.. ఈ నియోజకవర్గాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచే పోటీ చేస్తానని చంద్రబాబు పునరుద్ఘాటించారు. మూడు రోజుల పర్యటన కోసం చంద్రబాబు కుప్పం వచ్చారు. ఈరోజు ఉదయం విమానంలో అమరావతి నుంచి బెంగుళూరు చేరుకుని అక్కడినుంచి రోడ్డు మార్గంలో కుప్పం చేరుకున్నారు. బెంగుళూరు విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. కర్ణాటకలో స్థిరపడిన తెలుగువారు పెద్ద ఎత్తున తరలివచ్చి తెదేపా అధినేతకు స్వాగతం పలికారు.
చిత్తూరు జిల్లా దేవరాజుపురంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న బాబు.. నేతలు మారినా కార్యకర్తలు పార్టీ వెంటే ఉన్నారని గుర్తు చేశారు. కార్యకర్త ఒంటిపై పడే దెబ్బ తనకు తగిలినట్లుగా భావిస్తానన్న అధినేత.. అధికార పార్టీ ఇబ్బందిపెడితే 20 రెట్లు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.
'వైకాపా దోపిడీకి అడ్డుపడతానని నన్ను లక్ష్యంగా చేసుకొన్నారు. తెదేపా కార్యకర్తలపైనా కేసులు పెడుతున్నారు. దేవరాజుపురంలో తెదేపా జెండా దిమ్మెను తొలగించారు. క్యాడర్‌ను ఇబ్బంది పెట్టే ఏ ఒక్కరినీ వదిలిపెట్టను. మనమంతా ఏకమైతే పోలీసులు ఏం చేయగలరు. 3 నెలలకోసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తా. కుప్పంలో కార్యకర్తల ఇష్ట ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటాను' అని చంద్రబాబు స్పష్టం చేశారు.
అరిమానుపెంట రచ్చబండ కార్యక్రమంలో చంద్రబాబు
అరిమానుపెంట రచ్చబండ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. సీఎం జగన్.. ఏ పనీ చేయకుండా వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ ఊసే లేదని ఆరోపించారు. రాష్ట్రంలో 60 ఏళ్లలో రూ.3.5 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. జగన్ 2.5 ఏళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు.