ప్రజారాజధాని అమరావతికి వైకాపా తప్ప అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అలుపెరుగని పోరాటం చేస్తున్న రైతుల పోరాటం వృథా కాదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అప్పులు తెచ్చుకునేందుకే వ్యవసాయ మోటార్లు పెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత ఉంది
అవనిగడ్డలో వారంలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవటం ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. పంట నష్టం అంచనాను ప్రభుత్వం సక్రమంగా చేపట్టకపోవటంతో అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైకాపా గూండాయిజం పెరిగిపోయిందన్న చంద్రబాబు.. స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత ఉందన్నారు. రాష్ట్ర ఆదాయం సృష్టించడం చేతకాక పన్నులు పెంచి ముఖ్యమంత్రి జగన్ కాలాన్ని నెట్టుకొస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
తాగునీటి పన్ను, చెత్త పన్ను, సీవరేజీ పన్ను ఇలా అన్నీ పెంచుకుంటూ పోతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. చివరికి మరుగుదొడ్ల వినియోగం, జుట్టు పెంపు, రోడ్లపై నడకకు కూడా పన్ను వేస్తారేమో అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అంతకుముందు పొట్టిశ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలోనూ చంద్రబాబు మాట్లాడారు.
నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ తెదేపా