రాష్ట్రంలో చిన్నతరహా పరిశ్రమల నిర్వహణపై కరోనా తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. కృష్ణా జిల్లాలో నున్న, ఆగిరిపల్లి, నూజివీడు తదితర ప్రాంతాల్లో.. కోడి గుడ్లు నిల్వ ఉంచే ట్రేలు తయారు చేసే చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కంపెనీలకు కాగితం, అట్టపెట్టలు లాంటి ముడిసరకు లభించక అవస్థలు పడుతున్నాయి.
ట్రేలు తయారు చేసేందుకు వేసవి కాలమే అనువైనదని, వర్షాకాలంలో తయారు చేయడానికి కుదరదని నిర్వాహకులు చెబుతున్నారు. కానీ గత రెండేళ్లుగా వేసవిలో లాక్‌డౌన్ విధిస్తుండడంతో.. చాలా నష్టపోతున్నామంటున్నారు. ముడి సరుకు ధర పెరిగిపోయిందని, కూలీల రేట్లు కూడా పెరిగిపోతున్నాయని పరిశ్రమల నిర్వాహకులు వాపోతున్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ వల్ల పనివేళలు తగ్గడంతో.. వేతనాలు సరిపోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ఫ్యూ వల్ల చిన్నతరహా పరిశ్రమలు ఉత్పత్తి సాధించలేకపోతున్నాయని.. ప్రభుత్వమే ఆదుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.