ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మంత్రం వేసిన జగన్.. కూల్ అయిపోయిన బాలినేని..! - బాలినేని అసంతృప్తి

కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం
కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం

By

Published : Apr 11, 2022, 3:06 PM IST

Updated : Apr 11, 2022, 7:51 PM IST

15:03 April 11

బాలినేని బుజ్జగింపుల పర్వం ముగిసింది. మంత్రివర్గంలో స్థానం దక్కనందుకు నిన్నటి నుంచీ అసంతృప్తితో రగిలిపోయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎట్టకేలకు శాంతించారు. ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకు తన ఆగ్రహాన్ని మౌనంగానే వ్యక్తపరిచిన బాలినేని.. చిట్ట చివరకు దిగివచ్చారు. ముఖ్యమంత్రి ఏం మంత్రం వేశారో గానీ.. ఆయనతో భేటీ అనంతరం పూర్తిగా కూల్ అయిపోయారు. తాను వైఎస్ కుటుంబానికి విధేయుడిని అని ప్రకటించుకున్న మాజీ మంత్రి.. జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు.

మూడుసార్లు కలిసిన సజ్జల : కొత్త మంత్రుల జాబితాలో తన పేరు కొనసాగించకపోవడంతో బాలినేని ఆదివారం నుంచీ అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా సాగింది. దీంతో విజయవాడలోని బాలినేని నివాసానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, అనిల్​, మాధవరావు వెళ్లారు. బాలినేనితో సమావేశమై.. బుజ్జగించే ప్రయత్నం చేశారు.

నిన్న(ఆదివారం) సాయంత్రం కొత్త మంత్రుల పేర్లు బహిర్గతం అయినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి బాలినేనితో మూడుసార్లు సమావేశమయ్యారు. నిన్న మధ్యాహ్నం ఒకసారి, రాత్రి శ్రీకాంత్‌రెడ్డితో కలిసి మరోసారి బాలినేనిని కలిసిన సజ్జల.. ఇవాళ(సోమవారం) మూడోసారి బాలినేనితో భేటీ అయ్యారు. అయినప్పటికీ మాజీ మంత్రి మెత్తబడలేదు.

ఈ క్రమంలోనే సీఎం జగన్ స్వయంగా బాలినేని శ్రీనివాస్‌ రెడ్డితో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. బాలినేనిని తన వద్దకు తీసుకురావాల్సిందిగా సజ్జలను సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి కలిసి బాలినేనిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు బాలినేని చేరుకున్నారు. మంత్రిపదవి రాకపోవడానికి గల కారణాలను వివరిస్తూ.. భవిష్యత్ హామీలతో బానినేనిని ముఖ్యమంత్రి జగన్ బుజ్జగించారు. దీంతో.. చల్లబడిన బాలినేని తాను వైఎస్ కుటుంబానికి, వైకాపాకు విధేయుడినని మీడియా ముఖంగా ప్రకటించారు.

"మంత్రి పదవి విషయంలో రాజీనామా చేస్తానన్న వార్తల్లో నిజం లేదు. గతంలో జగన్ కోసం మంత్రి పదవి వదులుకున్నా. మేము వైకాపా, వైఎస్‌ఆర్‌ కుటుంబం, జగన్‌కు విధేయులం. మంత్రి పదవి అనేది సీఎం ఆలోచన మేరకు ఉంటుంది. మంత్రి పదవి కోసం ఎప్పుడూ అర్రులు చాచే పరిస్థితి లేదు. అందరికీ పదవులు ఒకేసారి రావు. సమయానుకూలంగా పదవులు అవే వస్తాయి. జగన్‌ ఇచ్చిన పార్టీ బాధ్యతలను నెరవేరుస్తా. గతంలో కంటే ఎక్కువ సీట్లు రావడానికి కృషిచేస్తా. ఆదిమూలపు సురేశ్‌, నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. సురేశ్‌కు మంత్రి పదవి ఇస్తే నేను అలకబూనాననడం అవాస్తవం. ఆదిమూలపు సురేశ్‌, నేను మంత్రులుగా కలిసి పనిచేశాం. జగన్ నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. సమర్థత ఉన్న నాయకులనే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కొత్త మంత్రులు మంచి పేరు తీసుకువస్తారని ఆశిస్తున్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. సీఎం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నా. కొత్త మంత్రివర్గానికి అందరూ మద్దతివ్వాలి" - బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి

ఇదీ చదవండి: Minister Balineni: మంత్రివర్గ విస్తరణలో వందశాతం కొత్తవారే.. పార్టీ ముఖ్యమన్న బాలినేని

Jagan New Cabinet: కొలువుదీరిన జగన్ కొత్త టీం

Last Updated : Apr 11, 2022, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details