రాష్ట్రంలో ఎయిడెడ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులను ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి తీసుకోవడంతో కొత్తగా చేపట్టబోయే నియామకాల్లో ఖాళీల సంఖ్య తగ్గిపోనుంది. ఇది ప్రభుత్వ విద్యాసంస్థల్లో బోధన వృత్తిలోకి రావాలనుకుంటున్న నిరుద్యోగుల ఆశలపై ప్రభావం చూపనుంది. ఉపాధ్యాయులు, అధ్యాపకులు కలిపి మొత్తం 8,573 మంది ఎయిడెడ్ నుంచి ప్రభుత్వంలోకి వస్తున్నారు. వీరిలోని 1091 మంది ఎయిడెడ్ అధ్యాపకులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఒప్పంద సిబ్బంది మినహా 500 వరకు ఉన్న ఖాళీలన్నీ ఎయిడెడ్ అధ్యాపకులతో నిండిపోనున్నాయి. మిగిలిన వారిలో కొందరిని విశ్వవిద్యాలయాలకు పంపించేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో విశ్వవిద్యాలయాల్లో పనిచేసేందుకు 285 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిని వర్సిటీల్లో నియమిస్తే అక్కడ కొన్ని ఖాళీలు భర్తీ అవుతాయి. ప్రభుత్వం రెండు వేల సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో ప్రకటన విడుదల చేస్తామని జాబ్ క్యాలెండర్‌లో ప్రస్తావించింది. తాజా పరిణామంతో ఈ సంఖ్య తగ్గిపోతుందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో 1946 ఎయిడెడ్ పాఠశాలలు ఉండగా, వీటిల్లో 6,982 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
ఎయిడెడ్ సిబ్బంది విలీనంతో వీరంతా జిల్లా, మండల పరిషత్తు పాఠశాలల్లోకి వస్తారు. సిబ్బందిని వెనక్కి ఇచ్చేందుకు సమ్మతించిన ఎయిడెడ్ విద్యాసంస్థల నుంచి ఇప్పటికే ఉపాధ్యాయులు వచ్చి ఎంఈవోల వద్ద రిపోర్టు చేశారు. దీంతోపాటు నూతన జాతీయ విద్యా విధానంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీ పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉంది. ఎస్జీటీల పదోన్నతుల ద్వారా స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలు కొంతవరకు భర్తీ అవుతాయి. దీనికితోడు ఎయిడెడ్ సిబ్బంది రావడంతో ఖాళీలు దాదాపుగా భర్తీ కానున్నాయి.