కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఆంధ్రరత్న భవన్ నుంచి ప్రారంభమైన నిరసన ప్రదర్శన తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు సాగింది. ఉత్తరప్రదేశ్లో రైతులను పరామర్శించేందుకు, భాజపా నాయకత్వాన్ని ఎండగట్టేందుకు వెళ్లిన ప్రియాంకాగాంధీని అరెస్ట్ చేయడం అన్యాయమని కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు శైలాజనాథ్ అన్నారు. నిప్పుతో చెలగాటమాడుతూ వారి నాశనానికి వారే ముహూర్తం పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పాలించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని శైలజానాథ్ దుయ్యబట్టారు. రైతులపై కేసులు పెట్టే ప్రయత్నం చేయడం తగదన్నారు. తక్షణమే వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.