ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్‌ నిబంధనలను పాటించాల్సిందే: ఎస్ఈసీ - ap sec on muncipal elections

రాజకీయ పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఎన్నికల నిర్వహణపై నేతల అభిప్రాయలను తెలుసుకున్నారు. సమావేశంలో నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎస్‌ఈసీ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్‌ఈసీ వ్యవహారశైలి మారకుంటే ప్రశాంతంగా ఎన్నికలు జరగడం అసాధ్యమని... తెలుగుదేశం నేత వర్ల రామయ్య అన్నారు. వలంటీర్లపై ఆంక్షలు విధించడం తగదని ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు వైకాపా నేత నారాయణమూర్తి తెలిపారు

ap sec all party meeting on conduction of municipal elections
ap sec all party meeting on conduction of municipal elections

By

Published : Mar 1, 2021, 3:03 PM IST

Updated : Mar 2, 2021, 6:00 AM IST

ఎస్​ఈసీ ఆఖిలపక్ష సమావేశం

ఎన్నికల ప్రచారంలో కొవిడ్‌ నిబంధనలను విధిగా పాటించాలని రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ సూచించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో సోమవారం వివిధ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయ వ్యవస్థకు లోబడి ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటుందని, హైకోర్టు సూచనల మేరకు తాను వ్యవహరిస్తున్నానని ఎన్నికల కమిషనర్‌ వివరించారు. దీర్ఘకాలికంగా ఒకే చోట పని చేస్తున్న ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేసిన సిఫార్సుల్లో మార్పులు జరిగాయని తెలిపారు. పోలింగ్‌ రోజున వృద్ధులు, వికలాంగులు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రభుత్వ యంత్రాంగమే ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించాలని రాజకీయ పార్టీలు ఎస్‌ఈసీని కోరాయి.

మాట్లాడినపుడు అడ్డుతగిలితే ఎలా?
సమావేశంలో ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌, తెదేపా నేత వర్ల రామయ్య మధ్య సంవాదం చోటుచేసుకుంది. నాలుగు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలపైనా, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేసి ఫలితాలు తారుమారు చేశారంటూ అధికారులపై చేసిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారని రామయ్య ఎస్‌ఈసీని ప్రశ్నించారు. సమావేశంలో స్వరం పెంచి మాట్లాడటంపై ఎన్నికల కమిషనర్‌ అభ్యంతరం వ్యక్తం చేసి ఇలాగే మాట్లాడతారా? అని ప్రశ్నించినట్లు సమాచారం. తన స్వరమే అంతని, ఎక్కడైనా ఇదే విధంగా మాట్లాడతానని రామయ్య సమాధానమిచ్చారని తెలిసింది. పార్టీల ప్రతినిధులంతా మాట్లాడాక వారు ప్రస్తావించిన అంశాలపై ఎస్‌ఈసీ చివర్లో సమాధానమిచ్చే ప్రయత్నం చేసినపుడు రామయ్య మరోసారి జోక్యం చేసుకొని ఏదో చెప్పబోయారు. దీనిపై ఎస్‌ఈసీ ఆగ్రహం వ్యక్తం చేశారని, తాను మాట్లాడుతున్నప్పుడు ఇలా అడ్డు తగిలితే బయటకు పంపాల్సి ఉంటుందని హెచ్చరించారని సమాచారం. తనది పెద్ద గొంతని చెప్పి మీరెలా గట్టిగా మాట్లాడుతున్నారని, సమావేశానికి పిలిచి ఇప్పుడు వెళ్లిపోమంటే ఎలా? పార్టీ తరఫున పొలిట్‌బ్యూరో సభ్యుడిగా మా వైఖరి చెప్పొద్దా.. అని వర్ల రామయ్య ఎన్నికల కమిషనర్‌ను ప్రశ్నించారని తెలిసింది. ఎన్నికల ప్రత్యేక అధికారి, అదనపు పోలీసు డైరక్టర్‌ జనరల్‌ సంజయ్‌ జోక్యం చేసుకొని తెదేపా నేతకు నచ్చజెప్పారని సమాచారం.

మొదట చూసిన ఎస్‌ఈసీలా లేరు: రామయ్య
సమావేశం అనంతరం వర్ల రామయ్య విలేకర్లతో మాట్లాడుతూ.. రమేశ్‌ కుమార్‌ తాము మొదట చూసిన ఎన్నికల కమిషనర్‌లా లేరని, ఆయనలో తేడా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సమావేశానికి వచ్చినప్పటి నుంచి విమానానికి టైం అవుతుందంటూ నిప్పుల కుంపటిపై కూర్చున్నట్లుగా ఎస్‌ఈసీ వ్యవహరించారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలపై ఏం చర్యలు తీసుకున్నారంటే సమాధానం చెప్పకపోగా, కేవలం 5 నిమిషాల సమయమిచ్చి కూర్చోబెట్టేశారని రామయ్య ఆరోపించారు. పోలీసు అధికారులు కొందరు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి వెళ్లి ఫలితాలను ప్రభావితం చేశారని, అలాంటి వారు పుర ఎన్నికల్లో పాల్గొనకుండా ఎన్నికల సంఘం నియంత్రించాలని ఎస్‌ఈసీకి రామయ్య సూచించారు.
వాలంటీర్ల వ్యవస్థపై నియంత్రణ ఎత్తివేయాలి: వైకాపా
వాలంటీర్ల వ్యవస్థపై నియంత్రణను వెంటనే ఎత్తివేసి, వారి హక్కులను కాపాడాలని ఎన్నికల కమిషనర్‌ను కోరినట్లు వైకాపా అధికార ప్రతినిధులు నారాయణమూర్తి, పద్మజ తెలిపారు. ఓటమి భయంతో తెదేపా శ్రేణులు వైకాపా అభ్యర్థుల వాహనాలను దహనం చేయడం, దాడులకు దిగడంపై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయగా ఎస్‌ఈసీ సానుకూలంగా స్పందించారని చెప్పారు.

ప్రభుత్వంతో ఎస్‌ఈసీ కుమ్మక్కయ్యారు: కాంగ్రెస్‌
ఎన్నికల కమిషనర్‌ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని పీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్‌ వలీ ఆరోపించారు. నిలిచిపోయిన దగ్గర నుంచే ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభించాలని ఎస్‌ఈసీ నిర్ణయించినప్పటి నుంచే ఆయనపై అనుమానం వచ్చిందన్నారు. ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో తూతూమంత్రంగా సమావేశం నిర్వహించిందన్నారు. విజయవాడ నగరపాలక సంస్థలో డివిజన్ల విభజన హేతుబద్దంగా జరగనందున ఎవరి ఓట్లు ఎక్కడ ఉన్నాయో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడిందని సీపీఐ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ జె.విల్సన్‌ అన్నారు. ఓటర్ల స్లిప్పులు గడువులోగా పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

పోలీసుల తీరుకు నిరసనగా.. విమానాశ్రయంలో చంద్రబాబు బైఠాయింపు

Last Updated : Mar 2, 2021, 6:00 AM IST

ABOUT THE AUTHOR

...view details