రాష్ట్రంలో ఆక్సిజన్‌కు, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు కొరత లేదని ఉప ముఖ్యమంత్రి(వైద్యం) ఆళ్లనాని స్పష్టంచేశారు. మంగళగిరిలో బుధవారం మంత్రుల కమిటీ సమావేశంలో ఆళ్లనాని మాట్లాడుతూ... ‘‘కొవిడ్ లక్షణాలు ఎక్కువగా ఉన్న వారికి ఆసుపత్రుల్లో, తక్కువగా ఉన్న వారికి కొవిడ్ కేర్ కేంద్రాల్లో చికిత్స అందిస్తాం. కేంద్రం నుంచి వస్తున్న ఆక్సిజన్‌ను పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నాం. టీకాలను అర్హులకు అందజేస్తున్నాం. ప్రభుత్వ నిఘా పెరగడంతోనే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులోనికి వస్తున్నాóు. వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలను లెక్క చేయకుండా సేవలు చేస్తున్నారు. వారికి ఎలాంటి సమస్యలున్నా... పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం పకడ్బందీగా పనిచేస్తున్నా... తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. హైదరాబాద్‌లో కాకుండా రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉండి మాట్లాడాలి. విశాఖలో చిన్నారి మృతి ఘటనపై విచారణకు ఆదేశించాం. వైద్య సిబ్బంది తప్పుంటే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని వివరించారు. సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, సుచరిత, అప్పలరాజు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ గౌతమ్‌సవాంగ్, అధికారులు పాల్గొన్నారు.
‘పడకల వివరాలపై పొంతన లేదేం’
రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు, ఆసుపత్రుల్లో పడకలు, కొవిడ్ కేంద్రాల్లో సౌకర్యాలు, నాణ్యమైన ఆహార సరఫరా తదితర అంశాలపై మంత్రుల కమిటీ ప్రధానంగా చర్చించింది. కాగితాలపై ఉండే పడకల ఖాళీల వివరాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వివరాలకు పొంతన ఉండకపోవడం ప్రస్తావనకు వచ్చింది. అలాగే... నిరుడు కొవిడ్ కేర్ కేంద్రాల్లో ఎక్కువ మంది ప్రయోజనం పొందారు.. ఇప్పుడా పరిస్థితి ఎందుకు లేదనే అంశంపైనా చర్చించారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకొస్తే కేసులు అధికంగా నమోదైన ప్రాంతాల్లో కంటైన్‌మెంట్, ఇతర నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న విషయం ప్రస్తావన రాగా దానికి అలాచేయడం మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తమైంది.